ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి
పరీక్షా పే చర్చలో భాగంగా విద్యార్థులతో ముచ్చటించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె.. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు సలహా
ప్రధాని నరేంద్రమోడీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ ఈసారి కొద్దిగా భిన్నంగా నిర్వహించారు. ప్రధాని ప్రారంభించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొణె పాల్గొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా దీపిక తాను మానసిక ఆందోళనకు గురైన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను చాలా కుంగిపోయానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండోవిడతలో భాగంగా ఒత్తిడిని జయించడం, మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు ఆమె విలువైన సలహాలు ఇచ్చారు. ఒత్తిడి జీవితంలో భాగమేనన్న దీపిక పరీక్షలు, ఫలితాల విషయంలో సహనం ఉండాలని స్పష్టం చేశారు. బాగా నిద్రపోవాలని, నీళ్లు బాగా తాగాలని, వ్యాయామం, మెడిటేషన్ చేయాలని విద్యార్థులకు సూచించారు. తనను తాను అల్లరి పిల్లగా చెప్పుకున్న దీపిక పాఠశాల రోజుల్లో చదువు కంటే ఇతర వ్యాపకాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేదని వివరించారు. ఫ్యాషన్, డాన్స్, క్రీడల్లో ఎక్కువగా పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. అదృష్టవశాత్తు ఎక్కువ మార్కుల కోసం తన తల్లిదండ్రులు ఒత్తిడి చేయలేదని దీపిక వివరించారు. తల్లిదండ్రులంతా తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించాలని సూచించారు.