జెడియు,ఆర్జెడీల్లో చీలికలు తెస్తాం, బీహార్ ను వదిలే సమస్యే లేదు -బిజెపి ఎంపి
బీహార్ లో తమకు చేయిచ్చి ఆర్జెడీతో జత కట్టినందుకు నితీష్ కుమార్ పై బీజేపీ కసితో రగిలిపోతోంది. త్వరలోనే జెడియు,ఆర్జెడీల్లో చీలికలు తెస్తామని, బీహార్ లో జేడీయూను లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ ఆక్రోశం వెళ్ళగక్కారు.
బీహార్ ను జెడియు రహిత రాష్ట్రంగా చేస్తామని బిజెపి రాజ్యసభ ఎంపి సుశీల్ కుమార్ మోడి స్పష్టం చేశారు. మణిపూర్ లో ఐదుగురు జెడియు ఎమ్మెల్యేలను విలీనం చేసుకుని నితీష్ కుమార్ కు షాకిచ్చిన బిజెపి ఇతర రాష్ట్రాలలోని బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు మరింత ఉత్సాహ పడుతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికే జార్ఖండ్ లో ఆ కుటిల ప్రయత్నలలో తలమునకలవుతోంది. ఒక వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడినా లాభం ఉండదని, మరోకరు సీఎం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అందుకే ఏకంగా యుపిఎ కూటమిలోని జెఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వేచిచూస్తోంది.
ఎన్డీయే లో ప్రధాని మోడీకి సన్నిహితుడిగా మెలిగిన నితీష్ కుమార్ బిజెపితో తెగదెంపులు చేసుకుని ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి మహాఘట్ బందన్ ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని మోడీ సహించలేకపోతున్నారు. "మణిపూర్ లో ఐదుగురు జెడియు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి ఎన్‌డియేలో చేరారు. వారు ఎన్డీయేతో కొనసాగుతారు. దీంతో ఆ రాష్ట్రంలో జెడియు నామరూపాలు లేకుండా పోయింది. ఇదే విధంగా బీహార్ లో కూడా జెడియు-ఆర్జేడీ కూటమిలో కూడా చీలిక తెచ్చి జెడియు ని కనుమరుగు చేస్తాము'' అని సుశీల్ మోడీ అన్నారు. ఈ రోజు జెడియు సమావేశం జరుగుతున్న సందర్భంగా నితీష్ కుమార్ ను స్వాగతిస్తూ ..కాబోయే ప్రధాని, దేశ్ కీ నేత అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని ఉద్దేశించి సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ.. " పోస్టర్లు, హోర్డింగులు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ ప్రధాని కాలేరని" అన్నారు.
ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు కృషి చేస్తానని నితీష్ కుమార్ చెప్పారు. అయితే, ప్రతిపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని కూడా ఆయన అన్నారు. ఇటీవల నితీష్ కుమార్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ఏర్పాటుకు గల అవకాశాలు, ఆవశ్యకత పై చర్చించారు. విపక్షాల తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరన్న ప్రశ్నకు కెసిఆర్ జవాబిస్తూ..విపక్షాల కూటమి ఏర్పాటైన తర్వాత భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి ఏకాభిప్రాయంతో అభ్యర్ధిని నిర్ణయిస్తామని చెప్పారు.