మాకు బాంబులు వాడే పరిస్థితిని కల్పించవద్దు...బీజేపీ నిరసనలో డీఎంకేను బెదిరించిన మాజీ ఆర్మీ అధికారి

“ ఈ నిరసనలో పాల్గొన్న మా రిటైర్డ్ సైనికులందరూ బాంబులు వేయడం, కాల్చడం, ఫైటింగ్ చేయడంలో నిపుణులే. ఈ పనులన్నీ మాకు బాగా తెలుసు. మమ్మల్ని ఈ పనులు చేసే పరిస్థితికి తీసుకరావద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను” అని రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ బి పాండియన్ అన్నారు.

Advertisement
Update:2023-02-23 07:12 IST

మాజీ సైనికులను బాంబులు, తుపాకులు వాడే పరిస్థితికి నెట్టవద్దని ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి తమిళనాడు ప్రభుత్వాన్ని బెదిరించారు. చెన్నైలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ బి పాండియన్ ఈ హెచ్చరికలు చేశారు. పైగా డీఎంకే ఒక టెర్రరిస్టు గుంపు అని కూడా ఆయన ఆరోపించారు.

కృష్ణగిరిలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కౌన్సిలర్,అతని కుమారుడితో నీటి విషయంపై జరిగిన ఘర్షణ సందర్భంగా ప్రభు (28) అనే ఆర్మీ జవాన్ మృతి చెందాడు. దీనికి వ్యతిరేకంగా బిజెపి నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ బి పాండియన్ మాట్లాడుతూ, "భారత సైన్యం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యాలలో ఒకటి. అలాంటి సైన్యంతో ప్రభుత్వం చెలగాటమాడితే అది తమిళనాడు ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు.'' అన్నారు.

ఆర్మీ సైనికుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయని పాండియన్ హెచ్చరించారు. “నేను ప్రేమతో చెబుతున్నాను. ఈ నిరసనలో పాల్గొన్న మా రిటైర్డ్ సైనికులందరూ బాంబులు వేయడం, కాల్చడం, ఫైటింగ్ చేయడంలో నిపుణులే. ఈ పనులన్నీ మాకు బాగా తెలుసు. కానీ వాటిని చేయాలనే ఉద్దేశ్యం మాకు లేదు. మమ్మల్ని ఈ పనులు చేసే పరిస్థితికి తీసుకరావద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను” అని అన్నారు. డిఎంకెను “టెర్రరిస్ట్ గ్రూప్” అని పేర్కొన్న ఆయన, ప్రభువును చంపిన వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని మీడియా పాండియన్ ను ప్రశ్నించగా.. ఆయన వారితో వాగ్వాదానికి దిగాడు. ఇలాంటి ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా ? అని అడిగిన ప్రశ్నకు పాండియన్ ఇది హెచ్చరిక అని, బెదిరింపు కాదని అన్నారు. అయితే ఇలాంటి ప్రవర్తన కొనసాగితే తాము చెప్పినట్లే చేస్తామని ఆయన అన్నారు

Tags:    
Advertisement

Similar News