నువ్వు ముసలోడివి.. కాదు నువ్వు.. ఎన్సీపీలో మాటల మంటలు
ఈ వ్యాఖ్యలపై శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే కూడా గట్టిగా బదులిచ్చారు. 'మా సోదరుడి వయస్సు 65ఏళ్ళు.. ఇప్పుడు ఆయన సీనియర్ సిటిజన్' అంటూ విమర్శలు చేశారు
ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వు ముసలోడివి అంటే.. కాదు నువ్వే ముసలోడివి అంటూ.. ఒకరినొకరు దూషించుకుంటున్నారు. కొంతమంది 80 ఏళ్ల వయసు దాటినా పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా లేరంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఉద్దేశించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే కూడా గట్టిగా బదులిచ్చారు. 'మా సోదరుడి వయస్సు 65ఏళ్ళు.. ఇప్పుడు ఆయన సీనియర్ సిటిజన్' అంటూ విమర్శలు చేశారు.
అజిత్ పవార్ కొన్ని నెలల కిందట ఎన్సీపీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు ఇచ్చిన తెలిసిందే. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి శరద్ పవార్‌ను పలుమార్లు కలిసి తమతో కలిసిరావాలని.. బీజేపీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే పార్టీ నాయకత్వం అప్పగించాలని కూడా కోరారు.
అయితే అందుకు శరద్ పవార్ అంగీకరించలేదు. దీంతో అజిత్ తరచూ శరద్ పవార్ పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వయసును ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. 'మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు 58 ఏళ్ల వయసులో రిటైర్ అవుతున్నారు. చాలామంది 75 ఏళ్లు నిండిన తర్వాత వృత్తిపరమైన జీవితం నుంచి వైదొలుగుతున్నారు. కానీ, కొంతమంది 84 ఏళ్ళు వచ్చినా పదవీ విరమణ చేసేందుకు సిద్ధంగా లేరు' అంటూ పరోక్షంగా శరద్ పవార్ పై అజిత్ విమర్శలు చేశారు.
అజిత్ పవార్ చేసిన కామెంట్లకు సుప్రియ సూలే కూడా గట్టిగానే బదులిచ్చారు. తన సోదరుడు చిన్నవారేమీకాదని.. ఆయన కూడా సీనియర్ సిటిజనే.. అంటూ ఘాటుగా బదులిచ్చారు. శరద్ పవార్ వయసుపై అజిత్ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. నాలుగేళ్ల కిందట కూడా ఇటువంటి విమర్శలే చేశారు. 80 ఏళ్ళు వచ్చాయని .. పార్టీ బాధ్యతలు తనకు అప్పగించాలని శరద్‌ను కోరారు.