జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన వినేశ్‌ ఫొగాట్‌

శనివారం ప్రధాన మంత్రి కార్యాలయం వెలుపల తన అవార్డులను వదిలిపెట్టేందుకు ఆమె ప్రయత్నించారు. అయితే ఆమెను అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో.. వినేశ్‌ తన అవార్డులను కర్తవ్యపథ్‌ మార్గంలో విడిచిపెట్టి వెళ్లారు.

Advertisement
Update:2023-12-31 08:56 IST

భారత ప్రఖ్యాత మహిళా రెజ్లర్‌.. భారత క్రీడాకారులకు అందించే అత్యున్నత పురస్కారాలైన అర్జున అవార్డు, ఖేల్‌ రత్న అవార్డుల గ్రహీత వినేశ్‌ ఫొగాట్‌ శనివారం తన అవార్డులను ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ మార్గంలో వదిలేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్‌ ఎన్నిక కావడాన్ని వీరు నిరసించారు. ఈ నేపథ్యంలోనే వినేశ్‌ ఫొగాట్‌ తన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే శనివారం ప్రధాన మంత్రి కార్యాలయం వెలుపల తన అవార్డులను వదిలిపెట్టేందుకు ఆమె ప్రయత్నించారు. అయితే ఆమెను అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో.. వినేశ్‌ తన అవార్డులను కర్తవ్యపథ్‌ మార్గంలో విడిచిపెట్టి వెళ్లారు.

ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీత బజరంగ్‌ పునియా కూడా తన అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. కర్తవ్యపథ్‌ మార్గంలోనే తనకు వచ్చిన అవార్డును ఆయన వదిలివెళ్లాడు. ఏ క్రీడాకారుడి జీవితంలోనూ ఇలాంటి రోజు రాకూడదని, దేశంలోని మహిళా రెజ్లర్లు కఠిన దశను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా అతను ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశాడు. బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ కర్తవ్య పథ్‌కు వస్తున్న వీడియోను దీనికి జత చేశాడు.

బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన వీరు.. ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్‌ ఎన్నిక కావడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ నేపథ్యంలోనే దీనికి నిరసనగా తాను రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్టు సాక్షి మలిక్‌ ప్రకటించింది. డెప్లింపిక్స్‌ (బధిరుల ఒలింపిక్స్‌) పసిడి విజేత వీరేందర్‌ సింగ్ యాదవ్‌ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని తెలిపాడు. తాజాగా వినేశ్, బజరంగ్‌ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. మరోవైపు.. డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ కొత్త ప్యానల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News