విప‌క్షాల ఫోన్లు ట్యాపింగ్‌..మోడీ పై అల్వా బాంబు..

తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా ఆరోపించారు. ప్రధాని మోడీ ని లక్ష్యంగా చేసుకొని ఆమె ఆరోపణలు గుప్పించారు.

Advertisement
Update:2022-07-26 19:15 IST

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ల‌క్ష్యంగా చేసుకుని విప‌క్షాల ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి మార్గ‌రెట్ అల్వా 'ఫోన్ ట్యాపింగ్‌' అంటూ బాంబు పేల్చారు. తాను ఎవ‌రెవ‌రితో మాట్లాడుతున్నానో 'పెద్ద‌న్న‌య్య న‌రేంద్ర‌భాయ్ మోడీ' వింటున్నారంటూ ఆమె ఆరోపించారు. అందుక‌నే త‌న మొభైల్ ఫోన్ బ్లాక్ అయింద‌ని ఆమె అన్నారు. ప్ర‌ధానిని పెద్ద‌న్న‌య్యగా సంభోదిస్తూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ఫోన్ల‌ను వింటున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌యాల‌పై ట్విట్ట‌ర్ లో ఆమె పోస్టులు పెట్టారు.

అంత‌కు ముందు ఎంటిఎన్ఎల్ మార్గ‌రెట్ అల్వా పోన్ క‌నెక్ష‌న్ తొల‌గించిన‌ట్టు నోటీసులు పంపించింది. కెవైసీని స‌స్పెండ్ చేసిన‌ట్టు తెలిపింది. సిమ్ కార్డును బ్లాక్ చేస్తామ‌ని కూడా చెప్పింద‌ని ఆమె తెలిపారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల్సి ఉన్నందున తాను ఎవ‌రికీ ఫోన్ చేయ‌లేక‌పోతున్నాన‌ని క‌నీసం ఇన్ క‌మింగ్ కాల్స్ కూడా రావ‌డం లేద‌ని ఆమె అన్నారు. తాను టిఎంసి, బిజెపి, బిజెడి ఎంపీల‌తోఇక‌పై మాట్లాడ‌న‌ని త‌న ఫోన్ క‌నెక్ష‌న్ ను పున‌రుద్ధ‌రించాల‌ని వ్యంగ్యంగా ఎంటిఎన్ ఎల్ కు విజ్ఞ‌ప్తి చేశారు. ఆమె త‌న‌కు ప‌రిచ‌య‌స్థులైన బిజెపి ఎంపీలు, త‌ట‌స్తంగా ఉంటామ‌ని చెప్పినా టిఎంసీ,. బిజెడి ఎంపీల‌తో ఫోన్ లో మాట్లాడుతూ మ‌ద్ద‌తు కోరుతున్నారు. తాను ఈ ఎంపీల‌తో మాట్లాడుతున్న‌ట్టు ఎలా తెలిసింద‌ని అల్వా ప్ర‌శ్నించారు. పెద్ద‌న్న‌య్య ( మోడీ)ఎవ‌రు.. ఎవ‌రెవ‌రితో మాట్లాడుతున్నారో అన్నీ వింటున్నార‌ని వ్యంగ్య‌బాణాలు విసిరారు. న్యూ ఇండియా అంటే ఇదేనా అని చుర‌క‌లు వేశారు. విప‌క్ష రాజ‌కీయ నాయ‌కులు ఫోన్లు ట్యాపింగ్ కు గుర‌వుతున్నాయ‌ని త‌ర‌చూ ఫోన్ నంబ‌ర్లు మార్చుకోవాల్సి వ‌స్తోంద‌ని ఆమెఅన్నారు.

ఈ విష‌య‌మై విప‌క్షాలు కేంద్రం, ఎంటిఎన్ ఎల్ పై మండిప‌డుతున్నాయి. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న మార్గ‌రెట్ అల్వా ఫోన్ క‌నెక్ష‌న్ ను ఎందుకు క‌ట్ చేయాల్సి వ‌చ్చింద‌ని కాంగ్రెస్ పార్టీ స‌హా విప‌క్ష పార్టీలు ప్ర‌శ్నిస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా, ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని, మార్గరెట్ అల్వా దాఖలు చేసిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకున్నట్లు టెలికాం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇవి పిల్ల చేష్ట‌లు: బిజెపి

కాగా, మార్గ‌రెట్ అల్వా ఆరోపణలను "పిల్లచేష్ట‌లు" అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి,కొట్టిపారేశారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఫలితాలపై నమ్మకంగా" ఉన్నప్పుడు ఆమె ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

"ఎవరైనా ఆమె ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేయాలి? ఆమె ఎవరికైనా కాల్ చేయనివ్వండి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనే దానిపై మాకు నమ్మకం ఉంది. మేం ఎందుకు ట్యాప్ చేయాలి? ఇవి చిన్నపిల్లల ఆరోపణలు. ఆమె సీనియర్ రాజ‌కీయ నాయ‌కురాలు కాబట్టి అలాంటి ఆరోపణలు చేయకూడదు" అని జోషి ట్వీట్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News