ప్రేమంటే ద్వేషం....400 'లవ్ జిహాద్' కేసుల జాబితాను విడుదల చేసిన VHP

''VHP ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు “ధర్మ రక్షా అభియాన్” ప్రారంభించనుంది. "దుర్గా వాహిని (VHP మహిళా విభాగం) ద్వారా బాలికలలో లవ్ జీహాద్ కు సంబంధించిన అవగాహనను కలిగిస్తాం, లవ్ జీహాద్ ను నిరోధించడానికి ఒక‌ శక్తిని సృష్టిస్తాం " అని VHP జాయింట్ సెక్రటరీ సురేంద్ర జైన్ తెలిపారు.

Advertisement
Update:2022-12-02 08:14 IST

హిందుత్వ‌ గ్రూపు విశ్వహిందూ పరిషత్ (VHP) గురువారం 400 'లవ్ జిహాద్ కేసుల' జాబితాను విడుదల చేసింది. కేవలం మత మార్పిడి లక్ష్యంతో ముస్లిం పురుషులు ముస్లిమేతర యువతులను వివాహం చేసుకోవడాన్ని నిరోధించేందుకు కేంద్ర చట్టం చేయాలని డిమాండ్ చేసింది VHP.

విహెచ్‌పి జాయింట్ సెక్రటరీ సురేంద్ర జైన్ గురువారం మాట్లాడుతూ జిహాద్‌లోని వివిధ రూపాల్లో 'లవ్ జిహాద్' అత్యంత హేయమైనది, క్రూరమైనది , అమానుషమైనది. "సామాజిక శాంతికి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే లవ్ జిహాద్, చట్టవిరుద్ధమైన మతమార్పిడులను నిరోధించడానికి కఠినమైన చట్టం అవసరం ఉంది" అని జైన్ అన్నారు.

మేలో బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా చేతిలో హత్యకు గురైన మహారాష్ట్ర అమ్మాయి శ్రద్ధా వాకర్ సంఘటన‌ నేపథ్యంలో VHP ఈ జాబితా విడుదల చేసింది.

హిందుత్వ గ్రూపులు "లవ్ జిహాద్" గురించి చాలా కాలంగా విరుచుకుపడుతున్నాయి.

"10,000 మంది క్రైస్తవ బాలికలు లవ్ జిహాద్‌కు గురయ్యారని, హైదరాబాద్‌లో 2,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని కేరళ, కర్ణాటక చర్చిలు చెబుతున్నాయి. ఈ బాలికలపై కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. శాంతిని ఇష్టపడే హిమాచల్, లడఖ్ వంటి రాష్ట్రాలు కూడా లవ్ జిహాద్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. కేరళలో, బాలికలను ట్రాప్ చేసి సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌లకు పంపుతున్నారని చర్చి ఆరోపించింది, "అని VHP నాయకుడు జైన్ ఆరోపించారు.

2010లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్‌ను అత్యంత భయంకరమైన మత మార్పిడిగా అభివర్ణించిందని జైన్ తెలిపారు.

"కేరళకు చెందిన హదియా కేసులో, జిహాదీల తరపున‌ వాదించడానికి PFI వంటి తీవ్రవాద సంస్థలు ప్రముఖ న్యాయవాదులకు కోట్లాది రూపాయలు చెల్లించాయని స్పష్టమైంది. ఇందుకోసం విదేశాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు అందుకుంటున్నారు. చట్టవిరుద్ధమైన మతమార్పిడి, లవ్ జిహాద్, దాని అంతర్జాతీయ ఉగ్రవాద బంధం కారణంగా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే చట్టాలు చేయడం ద్వారా ఈ లవ్ జీహాద్ ను ఆపలేము. దేశవ్యాప్త చట్టం అవసరం, ఇది బలమైన జాతీయ చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, "అన్నారాయన.

మత మార్పిడికి వ్యతిరేకంగా విహెచ్‌పి దేశవ్యాప్త ప్రజా చైతన్య ప్రచారాన్ని కూడా ప్రారంభించనుందని జైన్ చెప్పారు.

భజరంగ్ దళ్ డిసెంబర్ 1 నుండి 10 వరకు ప్రతి బ్లాక్‌లో "శౌర్య యాత్రలు" చేపడుతుండగా, VHP ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు "ధర్మ రక్షా అభియాన్" ప్రారంభించనుంది. "దుర్గా వాహిని (VHP మహిళా విభాగం) ద్వారా బాలికలలో లవ్ జీహాద్ కు సంబంధించిన అవగాహనను కలిగిస్తాం, లవ్ జీహాద్ ను నిరోధించడానికి ఒక‌ శక్తిని సృష్టిస్తాం " అని జైన్ తెలిపారు.

మరో వైపు మతాంతర వివాహానికి, ప్రేమకు లవ్ జీహాద్ అనే నామకరణం చేసి ఒక మతం పట్ల ప్రజల్లో భయాందోళనలు రేకిత్తించడానికే హిందుత్వ గ్రూపులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News