వివాహ ఆహ్వాన పత్రిక.. పేజీలు కేవలం 280

280 పేజీలతో పెళ్లి కార్డ్ రెడీ చేయించాలనుకున్నాడు, కానీ అందులో ఏమేం రాయాలనేదే పెద్ద సమస్యగా మారింది. అందరికీ ఉపయోగపడే సమాచారమే తన పెళ్లి పత్రికలో ఉండాలనుకున్నాడు ముగిలన్.

Advertisement
Update:2023-03-02 08:40 IST

‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో పొడవాటి పెళ్లి కార్డ్ పట్టుకుని తెలిసిన వారికి, తెలియని వారికి.. అందరికీ ఇచ్చేస్తుంటాడు హీరో రాజేంద్ర ప్రసాద్. బంధుమిత్రుల అభినందనలతో అంటూ.. అందరి బంధువుల పేర్లు పెళ్లి కార్డులో అచ్చు వేసే సరికి అలా పొడవు పెరిగిపోయిందని వివరణ ఇచ్చుకుంటాడు హీరో. సరిగ్గా ఇలాంటి పెళ్లి కార్డే ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది. ఈ పెళ్లి కార్డులో 280 పేజీలున్నాయి.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్‌ బృందావన్‌ నగర్‌ కు చెందిన రవీంద్రన్‌, రంగనాయకి దంపతుల కుమారుడు ముగిలన్‌ ఐర్లాండులో ఉద్యోగం చేస్తున్నాడు. సేలంకు చెందిన నిత్య సుభాషిణ అనే యువతితో అతడికి పెళ్లి ఖాయమైంది. ఏప్రిల్ 10న వివాహం. అయితే పెళ్లి కార్డులు వెరైటీగా కొట్టించాలనుకున్నాడు ముగిలన్. 280 పేజీలతో ఏకంగా పెళ్లి పుస్తకాన్నే ప్రింట్ చేయించాడు. ఈ భారీ వివాహ ఆహ్వాన పుస్తకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

280 పేజీల్లో ఏముంటాయి..?

280 పేజీలతో పెళ్లి కార్డ్ రెడీ చేయించాలనుకున్నాడు, కానీ అందులో ఏమేం రాయాలనేదే పెద్ద సమస్యగా మారింది. అందరికీ ఉపయోగపడే సమాచారమే తన పెళ్లి పత్రికలో ఉండాలనుకున్నాడు ముగిలన్. తిరుక్కురల్‌ లోని 1330 ద్విపదలు, వాటి వివరణలు పెళ్లి కార్డ్ లో పొందుపరిచారు.

ఇక మిగతా కార్డ్ అంతా పిల్లల పేర్లు ముద్రించారు. ఆడ, మగ పిల్లల పేర్లు తమిళంలో ముద్రించారు. ఇలా లక్ష పేర్లను ప్రింట్ చేశారు. కొత్తగా పెళ్లయిన జంటలు.. పిల్లల పేర్లకోసం ఇబ్బంది పడకుండా ఈ కార్డ్ ఉపయోగపడుతుందని అంటున్నాడు ముగిలన్. ఇది తన తల్లిదండ్రుల ఐడియా అని చెబుతున్నాడు. ఈ పెళ్లి కార్డ్ మొదటి పేజీలో వధూవరుల పేర్లు, ముహూర్తం, వివాహ వేదిక వివరాలు ఉంటాయి. మిగతా పుస్తకం అంతా పద్యాలు, వివరణలు, పిల్లల పేర్లు ఉంటాయి. ఇలాంటి కార్డులు మొత్తం 500 ప్రింట్ చేయించారు.

Tags:    
Advertisement

Similar News