ప్రాణం తీసిన హెలికాప్టర్ సెల్ఫీ.. ఎలాగంటే..?

హెలికాప్టర్ బ్యాక్ గ్రౌండ్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు జితేంద్ర కుమార్. హెలికాప్టర్ ముందునుంచి క్రమంగా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు.

Advertisement
Update:2023-04-23 17:12 IST

రైల్వే ట్రాక్ ల దగ్గర, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో యువత సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చాలానే చూస్తున్నాం. యువతే కాదు, సెల్ఫీ పిచ్చిఉన్న ఎవరైనా తమ చుట్టూ ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోరు, ప్రమాదం మీదకొచ్చినా వారికి స్పృహ ఉండదు, సెల్ఫీ మోజులో ప్రాణాలు వదిలేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కేదార్ నాథ్ లో జరిగింది. అయితే ఇక్కడ హెలికాప్టర్ తో సెల్ఫీ ప్రాణం తీయడం విశేషం. ఓ ప్రభుత్వ అధికారి సెల్ఫీ మోజులో హెలికాప్టర్ దగ్గరకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.

ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌ నాథ్‌ లో హెలికాప్టర్‌ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు జితేంద్ర కుమార్ సైనీ అనే ప్రభుత్వ అధికారి. ఆయన ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌ మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌ గా ఉన్నారు. ఆయనకు హెలికాప్టర్లు కొత్తేమీ కాదు. కానీ కేదార్ నాథ్ లోని హెలిప్యాడ్ వద్ద ఇటీవల ప్రయాణికులకోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ని చూడగానే ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ హెలికాప్టర్ బ్యాక్ గ్రౌండ్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు జితేంద్ర కుమార్. హెలికాప్టర్ ముందునుంచి క్రమంగా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. వెనుకవైపు ఉన్న టెయిల్ రోటర్ దగ్గరగా వెళ్లాడు. టెయిల్ రోటర్ వేగంగా తిరుగుతున్న విషయాన్ని మరచిపోయాడు జితేంద్ర. ఆ రోటర్ రెక్క తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.

అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. యాత్రకోసం ఇప్పటి వరకు 16లక్షలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరుస్తారు, బద్రీనాథ్ ను ఏప్రిల్ 27న తెరుస్తారు. యాత్ర సందర్భంగా ప్రయాణికులకోసం కేదార్ నాథ్ దగ్గర హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. ఈ హెలికాప్టర్ దగ్గరే ప్రభుత్వ అధికారి జితేంద్ర ప్రాణం పోయింది. సెల్ఫీ సరదా ఒక్కోసారి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Tags:    
Advertisement

Similar News