వెనక్కి వెళ్లిపోతున్న కాంట్రాక్ట్ లు.. అదానీకి దెబ్బమీద దెబ్బ

ఓవైపు మార్కెట్లో షేర్లు కుప్పకూలుతున్నాయి, సంపద హరించుకుపోతోంది, మరోవైపు ప్రభుత్వ కాంట్రాక్ట్ లు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అదానీకి ముందు ముందు మరిన్ని షాకులు తప్పవని తేలిపోయింది.

Advertisement
Update:2023-02-06 17:30 IST

అదానీ గ్రూప్ అంటే నిన్న మొన్నటి వరకూ అదిరిపోయే రెస్పాన్స్ ఉండేది, కానీ ఇప్పుడది అనుమానంగా మారింది. అదానీ కంపెనీ అంటేనే అందరూ అనుమానిస్తున్నారు. ఆఖరికి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అదానీ గ్రూప్ కి అవమానాలు తప్పడంలేదు. ఉత్తర ప్రదేశ్ లోని మధ్యాంచల్ విద్యుత్ వితరన్ నిగమ్ (MVVNL) సంస్థ తాజాగా అదానీ వేసిన బిడ్ ని క్యాన్సిల్ చేసింది. దాని విలువ 5400 కోట్ల రూపాయలు కావడం విశేషం.

యూపీలో స్మార్ట్ మీటర్స్ కోసం విద్యుత్ పంపిణీ సంస్థ MVVNL బిడ్లు ఆహ్వానించింది. అదానీ కంపెనీ అన్నిటికంటే తక్కువ ధరకు స్మార్ట్ మీటర్లు ఇస్తామని బిడ్ దాఖలు చేసింది. 5400 కోట్లరూపాయల విలువైన ఈ బిడ్ ని MVVNL క్యాన్సిల్ చేసింది. ‘అన్ అవాయిడబుల్’ రీజన్స్ అనే కారణంతో బిడ్ ని కొట్టి వేస్తున్నట్టు ప్రకటించింది.

ఉత్తర ప్రదేశ్ లో 2.5కోట్ల స్మార్ట్ మీటర్లకోసం యూపీలోని 4 డిస్కమ్స్ టెండర్లు పిలిచాయి. ఈ టెండర్లలో అదానీ గ్రూప్ తోపాటు జీఎంఆర్, ఎల్&టి, ఇంటెలిస్మార్ట్ ఇన్ ఫ్రా సంస్థలు పాల్గొన్నాయి. ఒక్కో స్మార్ట్ మీటర్ ని 10వేల రూపాయలకు అందించేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అన్నిటికంటే ఇదే తక్కువ ధర. కానీ నాలుగు డిస్కమ్స్ లో ఒకటైన MVVNL ఈ ఆఫర్ ని తిరస్కరించింది. మరోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. మిగతా మూడు డిస్కమ్ లు కూడా అదానీ గ్రూప్ విషయంలో వెనకడుగు వేస్తాయని తెలుస్తోంది.

బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వారికే అదానీపై నమ్మకం లేదు. ఇక ఇతర రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు మార్కెట్లో షేర్లు కుప్పకూలుతున్నాయి, సంపద హరించుకుపోతోంది, మరోవైపు ప్రభుత్వ కాంట్రాక్ట్ లు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అదానీకి ముందు ముందు మరిన్ని షాకులు తప్పవని తేలిపోయింది.

Tags:    
Advertisement

Similar News