బైడెన్ మాస్క్ పెట్టుకుంటారు, మోదీ పెట్టుకోరు.. ఎందుకో తెలుసా..?

బైడెన్ మాస్క్ ఎందుకు పెట్టుకుంటారో, మోదీ మాస్క్ పెట్టుకోకుండా అంత ధైర్యంగా ఎందుకు తిరుగుతున్నారో ఒక్కమాటలో చెప్పి అందరికీ జ్ఞానోదయం కల్పించారు జేపీ నడ్డా. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

Advertisement
Update:2023-02-21 16:14 IST

కరోనా భయం తొలగిపోయినా కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా మాస్క్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? మీకెవ్వరికీ తెలియని రహస్యం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలిసిపోయింది. బైడెన్ మాస్క్ ఎందుకు పెట్టుకుంటారో, మోదీ మాస్క్ పెట్టుకోకుండా అంత ధైర్యంగా ఎందుకు తిరుగుతున్నారో ఒక్కమాటలో చెప్పి అందరికీ జ్ఞానోదయం కల్పించారు జేపీ నడ్డా. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

కర్నాటకలోని ఉడిపిలో ర్యాలీ చేపట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అక్కడ ఉన్నవారిలో ఏ ఒక్కరూ మాస్క్ పెట్టుకోలేదని చెప్పారు. దానికి కారణం భారత ప్రధాని అని క్లారిటీ ఇచ్చారు. భారత దేశ ప్రజలకోసం మోదీ 220కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేశారని చెప్పారు. అమెరికాలో మాత్రం ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎందుకంటే అక్కడ కేవలం 76శాతం మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ అయిందని భారత్ లో మాత్రం 100 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని అదే మన ఘనత అంటూ డబ్బా కొట్టుకున్నారు. మన దేశ ప్రధాని మోదీ సహా, భారతీయులెవరూ ఇప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

భారత్ లో వ్యాక్సిన్ తీసుకోనివారు లేరా..?

భారత్ లో కూడా ఇంకా కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారు ఉన్నారు, ఆమాటకొస్తే ఫస్ట్ డోస్ తీసుకున్నవారిలో ఎంతమంది సెకండ్ డోస్ కూడా తీసుకున్నారనేదానికి లెక్కే లేదు. వ్యాక్సిన్ల విషయంలో పంపిణీ అయిన డోసులు 220 కోట్లు అని చెబుతున్నారే కానీ, వాస్తవంలో ఆ డోసులు తీసుకున్న వారి సంఖ్యలో మాత్రం చాలా తేడాలున్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ నడ్డా మాత్రం భారత్ లో 220కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు, అదీ మోదీ చలవ వల్ల పంపిణీ అయ్యాయని చెప్పడం హాస్యాస్పదం.

కరోనా క్రెడిట్ అంతా మోదీదేనా..?

ఆమధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మోదీయే కొవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టారంటూ గొప్పలు చెప్పుకున్నారు, మోదీ దేవుడయ్యా అంటూ మరి కొంతమంది ఓ రేంజ్ లో బాకాలూదారు. వీటన్నిటినీ కాదని ఇప్పుడు బైడెన్ తో మోదీకి పోలిక చెబుతూ ఇంకో అడుగు ముందుకేశారు జేపీ నడ్డా. మరి లాక్ డౌన్ లో పోయిన ప్రాణాలను ఎవరి ఖాతాలో వేయాలి, ఆక్సిజన్ కొరత కారణంగా ఆస్పత్రుల్లో చనిపోయినవారి విషయంలో బాధ్యులెవరు..? కరోనా తర్వాత అల్లకల్లోలం అయిపోయిన కుటుంబాలకు దిక్కెవరు..? వీటికి సమాధానం చెప్పలేని నడ్డా.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాస్క్ వాడుతున్నారు, భారత్ లో జనాలు మాస్క్ లు వాడటం లేదు.. ఆ క్రెడిట్ అంతా మోదీ ఖాతాలోనే వేయాలని సెలవిచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలర్లకు అడ్డంగా బుక్కయ్యారు.

Tags:    
Advertisement

Similar News