మహిళా పోలీస్‌పై దాడి.. యూపీలో మరో ఎన్‌కౌంటర్..
పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం పోలీసులకు నిందితులు కనిపించడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్‌ను తీవ్రంగా గాయపర్చిన కేసులో ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాలలోకి వెళితే..
ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లోని సరయు ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఒక వ్యక్తి గొడవ పడ్డాడు. ఆ గొడవ ఘర్షణగా మారడంతో అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో మహిళా కానిస్టేబుల్ తలకు తీవ్రగాయం కారణంగా రక్తస్రావం జరిగింది. ఆమె తల ఫ్రాక్చర్ అయింది. దీంతో, వెంటనే ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.
అయితే నిందితులు మాత్రం అయోధ్య రైల్వే స్టేషన్ రాగానే దిగి పారిపోయారు. ఘటనకు సంబంధించి వార్తలు, వీడియోలు వాట్సప్ లో వైరల్ అయ్యాయి. కేసును సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు, యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం పోలీసులకు నిందితులు కనిపించడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో నిందితులు వారి వద్ద ఉన్న తుపాకులతో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కూడా తిరిగి కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ప్రధాన నిందితుడు అనీస్ ఖాన్ మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్‌గా గుర్తించారు. నిందితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల సమయంలో కలండర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు రతన్‌శర్మకు కూడా గాయాలయ్యాయి.
*