ఇంద్రుడిపై చర్యకు కలెక్టర్ కు రికమండ్ చేసిన తహసీల్దార్... లేఖ వైరల్

తమ ప్రాంతంలో చాలా కాలంగా వర్షాలు లేక కరువుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షాలు లేకపోవడానికి కారణమైన ఇంద్ర దేవుడిపై చర్యలు తీసుకోవాలని ఓ రైతు అధికారులకు పిర్యాదు చేశారు.

Advertisement
Update:2022-07-19 08:29 IST

 ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ రైతు పిర్యాదు చేశాడు. చాలా కాలంగా తమ ప్రాంతాలో వర్షాలు లేకపోవడానికి కారణమైన ఇంద్రుడిపై చర్య‌ తీసుకోవాలని సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు స్థానిక తహశీల్దార్ కు పిర్యాదు లేఖ ఇచ్చారు. తహసీల్దార్ ఆ లేఖను తదుపరి చర్యల కోసం కలెక్టర్ కు ఫార్ వర్డ్ చేశారు.

ప్రజల పిర్యాదులు తీసుకోవడానికి శనివారంనాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'సంపూర్ణ సమాధాన్ దివస్' పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. గోండా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు, గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్నల్‌గంజ్ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సుమిత్ కుమార్ యాదవ్ గోండా జిల్లాలోని కల్నల్‌గంజ్ తహశీల్‌లోని ఝలా గ్రామంలో నివసిస్తున్నారు.

ఈ ప్రాంతంలో చాలా కాలంగా వర్షాలు లేవు. కరువుతో అల్లాడిపోతోంది. దీనిపై సుమిత్ కుమార్ యాదవ్ ఇచ్చిన పిర్యాదు ఇలా ఉంది, "ఈ ఫిర్యాదును, నేను గౌరవనీయులైన అధికారుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా ప్రాంతంలో గత చాలా నెలలుగా వర్షాలు లేవు. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున, దీనికి బాధ్యులైన ఇంద్ర దేవుడిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.'' అని రాశాడా రైతు.

ఆ తర్వాత ఆ లేఖను తదుపరి చర్యలకోసం తహశీల్దార్ కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఆ లేఖపై 'తదుపరి చర్య కోసం ఫార్వార్డ్ చేయబడింది' అని రాసి ఆఫీస్ ముద్ర వేసి తహశీల్దార్ సంతకం పెట్టాడు.

అయితే, తహశీల్దార్ మాత్రం అటువంటి ఫిర్యాదు గురించి తన‌కు తెలియదని ఖండించారు. దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం, ఈ వైరల్ ఫిర్యాదు లేఖ గురించి తహశీల్దార్ నర్సింహ నారాయణ్ వర్మను అడిగినప్పుడు ఆయన షాక్ అయ్యారు. అతను, "అలాంటి లేఖ‌ నా వద్దకు రాలేదు. ఆ ఫిర్యాదు లేఖపై కనిపించే ముద్ర నకిలీ ముద్ర. ఈ మొత్తం వ్యవహారం కల్పితం. ఇది దర్యాప్తు చేయబడుతోంది. " అని అన్నారు.

అయితే చాలా పిర్యాదులు రావడంతో ఆ పిర్యాదులు చదవకుండానే తహశీల్దార్ నర్సింహ నారాయణ్ వర్మ సంతకం చేసి ఫార్ వర్డ్ చేసినట్టు కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు.

ఈ ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జిల్లా అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ డా.ఉజ్వల్ కుమార్ విచారణకు ఆదేశించారు. 


Tags:    
Advertisement

Similar News