టమోటా పండాలా, వద్దా.. నిర్ణయం మన చేతుల్లోనే..!

టమోటా పండుగా మారేందుకు కారణమైన జన్యువుని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా కనుగొన్నారు.

Advertisement
Update:2022-09-30 09:42 IST

టమోటా రైతులకు ఓ శుభవార్త. ప్రతి ఏటా టమోటా సాగులో నష్టపోతూ, నిల్వ చేయలేక అవస్థలు పడుతున్న రైతన్నలకు ఇది సంతోషాన్ని ఇచ్చే వార్త. టమోటా పండుగా మారేందుకు కారణమైన జన్యువుని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే ఇకపై టమోటా పచ్చిగా ఉండాలా, పండుగా మారాలా అనే నిర్ణయం మన చేతుల్లోనే ఉండబోతోంది. ఈ జన్యువుపై మరిన్ని పరిశోధనలు చేస్తే.. టమోటా పంట విషయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు.

ఆ ఘనత ఎవరిదంటే..?

టమోటా పండుగా మారేందుకు కారణమైన జన్యువుని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా కనుగొన్నారు. SIERF.D7 అనే జన్యువు కారణంగా ఇథిలిన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ప్రేరేపితమై.. టమాటా ఎరుపు రంగులోకి మారుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ ప్లాంట్‌ సైన్సెస్‌ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాహుల్‌ కుమార్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ ప్రొఫెసర్ అరుణ్‌ కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.

ఇథిలిన్‌ హార్మోన్‌ కారణంగా టమోటా పండుగా మారుతుంది. అయితే ఈ హార్మోన్‌ చాలా రకాల జన్యువులు ప్రేరేపిస్తున్నాయని గతంలో పరిశోధనలు తేల్చాయి. అందులో ప్రధాన జన్యువు కోసం ఇప్పుడీ పరిశోధన సాగింది. ఇథిలిన్‌ హార్మోన్‌ పని తీరును SIERF.D7 అనే జన్యువు ప్రభావితం చేస్తోందని తేల్చారు. ఈ జన్యువుని ప్రేరేపించినప్పుడు ఇథిలిన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ బాగా పనిచేసి టమోటా పండుగా మారింది. జన్యువు పనితీరును మందగించేలా చేస్తే టమోటా పండుగా మారలేదు. అంటే ఈ జన్యువుని తొలగిస్తే టమోటా పండుగా మారే కాలాన్ని పొడిగించుకుంటూ పోవచ్చనమాట. టమోటా నిల్వ పద్ధతుల విషయంలో జరుగుతున్న పరిశోధనల్లో జన్యువు గుర్తింపు ఓ ముందడుగు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్వ పద్ధతులపై మరిన్ని ప్రయోగాలు జరిగి, అవి సత్ఫలితాలను ఇస్తే.. 'టమోటాలను రైతులు రోడ్డుపై పారబోశారు' అనేది కేవలం గతకాలం వార్తగానే మిగిలిపోతుంది. భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రైతులకు తలెత్తవు.

Tags:    
Advertisement

Similar News