సిగ్నలెందుకు జంప్ చేశావ్.. ప్రశ్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కి. మీ. ఈడ్చుకెళ్ళిన కారు డ్రైవర్

బానెట్ పై ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు వెళుతున్న వేగానికి కింద పడే అవకాశం ఉన్నప్పటికీ అదేమీ అతడు పట్టించుకోలేదు. ఈ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల వారు, వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

Advertisement
Update:2023-02-14 20:25 IST

రోడ్లపై ప్రమాదాలు జరగడం మామూలే. అయితే ఇటీవల ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడమే కాకుండా, కనీసం వాహనాన్ని కూడా ఆపకుండా కిలోమీటర్ల మేర ఈడ్చుకు వెళ్లడం కామన్ గా మారింది. మహారాష్ట్రలో ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయగా, సిగ్నల్ ఎందుకు జంప్ చేశావని అడిగిన పాపానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కారులోని వ్యక్తి కిలోమీటరున్నర దూరం ఈడ్చుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.

పాల్ఘర్ జిల్లా వాసాయిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సోమనాథ్ చౌదరి విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో రెడ్ లైట్ పడ్డప్పుడు ఓ కారు సిగ్నల్ జంప్ చేసింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ కారు వద్దకు వెళ్లి సిగ్నల్ ఎందుకు జంప్ చేశావంటూ.. వాహనంలోని వ్యక్తిని ప్రశ్నించాడు. అతడి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ మాత్రం దానికే రెచ్చిపోయిన కారులోని వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ ను తొక్కిస్తూ కారును ముందుకు పోనిచ్చాడు.

కారు ఢీకొన్న ధాటికి సోమనాథ్ చౌదరి వాహన బానెట్ పై పడ్డాడు. అయినా కారులోని వ్యక్తి వాహనాన్ని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లాడు. బానెట్ పై ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు వెళుతున్న వేగానికి కింద పడే అవకాశం ఉన్నప్పటికీ అదేమీ అతడు పట్టించుకోలేదు. ఈ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల వారు, వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ కారును వెంబడించారు.

ఆ సమయంలో ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ జరిగి వాహనాలు అన్ని ఆగడంతో కారులోని వ్యక్తి వాహనాన్ని నిలిపాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల కర్కశంగా ప్రవర్తించిన కారు లోని వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ కారుని 19 ఏళ్ల యువకుడు నడిపాడని పోలీసులు తెలిపారు.

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేయడం, హత్యకు ప్రయత్నించడంపై కేసులు నమోదు చేసినట్లు వారు చెప్పారు. కారు ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ సోమ్ నాథ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా సిగ్నల్ జంప్ చేయడం, అడ్డొచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకు వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో నమోదు కాగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    
Advertisement

Similar News