బెంజ్ కార్ ఓపెనింగ్‌కు వెళ్లి బెంజ్ కంపెనీపైనే సెటైర్లు..
బెంజ్ ఎలక్ట్రిక్ కారు ధర 1.55 కోట్ల రూపాయలు. మరీ ఇంత రేటు ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలంటేనే వినియోగదారులు భయపడతారని, రేట్లు తగ్గించాలని, దానికోసం ఉత్పత్తి పెంచాలని సూచించారు గడ్కరీ.
సహజంగా ఏదైనా కొత్త వస్తువుని మార్కెట్లోకి విడుదల చేసేటప్పుడు సెలబ్రెటీలను పిలవడం కంపెనీలకు అలవాటు. వారు కూడా ఇతోధికంగా ఆ వస్తువుకి బాగానే ప్రచారం చేసిపెడతారు, తమకు కావాల్సింది తాము పుచ్చుకుంటారు. కానీ పొరపాటున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పిలిచి ఇరుక్కుపోయింది ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్. బెంజ్ కంపెనీనుంచి కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి విడుదల చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఆ కంపెనీపైనే సెటైర్లు వేయడం విశేషం.
సహజంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరు కొంటారు..? పెట్రోల్, డీజిల్ బాదుడు భరించలేనివారు కరెంటుతో నడిచే చౌక వాహనాల వైపు ఆసక్తి చూపిస్తారు. కానీ భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు భారీగా ఉంటున్నాయి. బైక్ లు, మోపెడ్ లు ఓ మోస్తరుగా ఉన్నా, కార్ల ధరలు మాత్రం మరీ ఎక్కువ. ఇంధనంతో నడిచే కార్లకంటే కరెంటుతో నడిచే కార్ల రేట్లు చాలా ఎక్కువ. ఇక లగ్జరీ కంపెనీల విషయానికొస్తే అది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ దేశీయంగా అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని మార్కెట్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. అంతా బాగానే ఉంది కానీ, రేటు మరీ ఎక్కువగా ఉందని, దాన్ని తాను కూడా కొనలేనని చురకలంటించారు గడ్కరీ.
బెంజ్ ఎలక్ట్రిక్ కారు ధర 1.55 కోట్ల రూపాయలు. మరీ ఇంత రేటు ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలంటేనే వినియోగదారులు భయపడతారని, రేట్లు తగ్గించాలని, దానికోసం ఉత్పత్తి పెంచాలని సూచించారు గడ్కరీ. భారతీయులంతా మధ్యతరగతి ప్రజలేనని, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని ఒడిసిపట్టుకోవాలంటే రేట్లు తగ్గించాల్సిందేనన్నారాయన. దేశంలో ప్రస్తుతం 15.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు గడ్కరీ. ఏడాదిలో వీటి విక్రయాలు 335 శాతం పెరిగాయని చెప్పారు.
ప్రారంభోత్సవాలకు వెళ్లిన నాయకులు ఆయా వస్తువులను వీలైనంత ఎక్కువగా పొగుడుతారు, ఆయా కంపెనీలను, వాటి అధినేతలను ఆకాశానికెత్తేస్తుంటారు. కానీ గడ్కరీ ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టారు. రేట్లు తగ్గించండి అంటూ బెంజ్ కంపెనీకే చురకలంటించారు.