సృజనాత్మక ఆలోచనలకు అద్భుతమైన వేదిక జీ-20 సమావేశం.. - కేంద్రమంత్రి తోమర్
మన ఆహార వ్యవస్థలను వైవిధ్యపరచడానికి, బలోపేతం చేయడానికి తమ నిబద్ధతలో భాగంగా, భారతదేశం "అంతర్జాతీయ చిరుధాన్యాలు, ఇతర పురాతన తృణధాన్యాల పరిశోధన చొరవ" (మహర్షి) ను ప్రారంభించిందని తెలిపారు.
ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సుస్థిర వ్యవసాయ పురోగతికి కావాల్సిన జ్ఞానం, అనుభవం, సృజనాత్మక ఆలోచనలను పంచుకోవడానికి ఈ సమావేశం ఒక అద్భుతమైన వేదిక అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియా సమావేశంలో తెలియజేశారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలను ప్రస్తావిస్తూ సమావేశంలో జరిగిన చర్చ ఆలోచింపజేసేలా సాగిందని, వ్యవసాయ-ఆహార విలువ గొలుసులలో(అగ్రి ఫుడ్ వాల్యూ చైన్స్) మహిళలు, యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. వారి క్రియాశీలక భాగస్వామ్యం సమాన అభివృద్ధికి కీలకం మాత్రమే కాదు, ఈ రంగంలో నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి కూడా కీలకమన్నారు.
మహిళలు, యువతకు సాధికారత కల్పించడం ద్వారా గణనీయమైన మార్పులు తీసుకువచ్చి వ్యవసాయానికి మెరుగైన సుస్థిర భవిష్యత్తును సృష్టించవచ్చునని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభించిన కార్యక్రమాలను, ఆయన దార్శనికతను ఈ సందర్భంగా ప్రశంసించారు.
వారణాసిలో జరిగిన 12వ ముఖ్య వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశంలో ప్రారంభించిన "అంతర్జాతీయ చిరుధాన్యాలు, ఇతర పురాతన తృణధాన్యాల పరిశోధన చొరవ" (మహర్షి)ను జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు కేంద్ర మంత్రి తోమర్ తెలియజేశారు. మన ఆహార వ్యవస్థలను వైవిధ్యపరచడానికి, బలోపేతం చేయడానికి తమ నిబద్ధతలో భాగంగా, భారతదేశం "అంతర్జాతీయ చిరుధాన్యాలు, ఇతర పురాతన తృణధాన్యాల పరిశోధన చొరవ" (మహర్షి) ను ప్రారంభించిందని తెలిపారు. అధిక పోషక విలువలు కలిగిన, ఆహార భద్రతకు దోహదపడే చిరుధాన్యాలు (శ్రీఅన్న) తో పాటు ఇతర సాంప్రదాయ ధాన్యాల సాగుని, వాటి వినియోగాన్ని దేశంతో పాటు ప్రపంచంలో పెంచడం భారతదేశం లక్ష్యమన్నారు. పరిశోధన, జ్ఞాన మార్పిడి, సాంకేతిక పురోగతి ద్వారా, ఈ తృణధాన్యాల సామర్థ్యాన్ని వెలికితీయడం, స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడం దీని లక్ష్యం అని తోమర్ తెలిపారు.
భారత జీ-20 అధ్యక్ష పాలనలో దృష్టి సారించిన మరో ప్రధాన అంశం వ్యవసాయంలో డిజిటలైజేషన్. ఉత్పాదకత, మార్కెటింగ్, వ్యవసాయ విలువ గొలుసులను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీల సామర్థ్యాన్ని భారతదేశం గుర్తించింది.
హైదరాబాద్ తో పాటు ఇంతకుముందు ఇండోర్, చండీగఢ్, వారణాసిలలో జరిగిన సమావేశాల్లో చురుకుగా పాల్గొని విలువైన సహకారం అందించిన జీ-20 ప్రతినిధులందరికీ కేంద్ర మంత్రి తోమర్ అభినందనలు తెలియజేశారు. భారత్ తర్వాత జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టే బ్రెజిల్ దేశానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు కైలాష్ చౌదరి, శోభా కరంద్లాజే, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్, కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా పాల్గొన్నారు.