రైతులపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేనీ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలో రైతులపై తన వాహనాన్ని ఎక్కించి నలుగురు రైతుల మరణానికి కారణమైన ఆశిష్ మిశ్రాను కాపాడుతున్న ఆయన తండ్రి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రైతులను కుక్కలతో పోల్చిన మిశ్రా,రాకేశ్ తికాయత్ రెండుపైసల విలువకూడా లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఎంపీ, ప్రస్తుత హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ రైతులపై, వాళ్ళ నాయకుడు రాకేశ్ తికాయత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులను కుక్కలతో పోల్చిన మిశ్రా, తికాయత్ రెండుపైసల విలువకూడా లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు.
మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపూర్ ఖేరీలో తన వాహనాన్ని రైతులపైకి ఎక్కించి నలుగురు రైతులను చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మంత్రి అజయ్ మిశ్రా ను అరెస్టు చేయాలని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని, తాము పండించే పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని, నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలనే డిమాండ్లతో రైతులు మూడు రోజుల పాటు ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి అజయ్ మిశ్రా తన అనుచరులతో మాట్లాడుతూ రైతులపై నోరు పారేసుకున్నాడు.
''ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయి.. ఒక్కోసారి కుక్కలు రోడ్డుపై మొరుగుతాయి.. ఒక్కోసారి కారు వెంట పరుగెత్తుతాయి. అవి మొరిగీ మొరిగీ వెళ్ళిపోతాయి. అది వాటి స్వభావం..'' అని ఢిల్లీలో ధర్నా నిర్వహించి ఇళ్ళకు వెళ్ళిపోయిన రైతుల గురించి మిశ్రా వ్యాఖ్యానించాడు.
రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ గురించి కూడా మిశ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ''రాకేష్ తికాయత్ నాకు బాగా తెలుసు, అతను రెండు పైసలకు కూడా పనికి రాడు. ఆయన రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసి, రెండుసార్లు ఓడిపోయాడు. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడుతాం. అందుకే నేను అలాంటి వారికి సమాధానం చెప్పను." అని అన్నాడు. ''వీళ్ళకు ఇలాంటి రాజకీయాల ద్వారే జీవనోపాధి సాగుతోంది. సమయం వచ్చినప్పుడు వీళ్ళకు గట్టి జవాబు ఇచ్చి తీరుతా'' అని అజయ్ మిశ్రా వ్యాఖ్యానించాడు.
అజయ్ మిశ్రా వ్యాఖ్యలపై రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రైతులను చంపిన హంతకుడు రైతులను హేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని భారతీయ కిసాన్ సంఘ్ మండి పడింది.