స్వలింగ వివాహాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఇప్పటి వరకూ ఈ వివాహాల పట్ల వ్యతిరేకంగా ఉన్న కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం స్వలింగ వివాహాలు చేసుకునేవారికి మేలు జరుగుతుందని చెప్పొచ్చు.
భారత్ లో స్వలింగ వివాహాలు చేసుకుంటున్నవారికి, చేసుకోవాలనుకుంటున్నవారికి కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆందోళనలను పరిశీలించడానికి ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది. కేంద్రం ఏర్పాటు చేసే ఆ కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. ఇప్పటి వరకూ ఇలాంటి వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం, కమిటీ వేస్తామని ప్రకటించడంతో ఎల్జీబీటి కమ్యూనిటీ సంతోషం వ్యక్తం చేసింది.
భారత్ లో స్వలింగ వివాహాలు జరుగుతున్నా.. వారి వివాహాలకు ఇంకా చట్టబద్ధత రాలేదు. అంటే వారిని భార్యా భర్తలుగా ప్రభుత్వం గుర్తించట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వరు, ఇతర సర్టిఫికెట్లలో కూడా వారి సంబంధాన్ని వ్యక్తపరిచేందుకు అనుమతి ఇవ్వరు. ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల ఇలాంటి జంటలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వీటి పరిష్కారం కోసం వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులు కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ పెళ్లిళ్లు భారతీయ సమాజానికి విరుద్ధం అని కేంద్రం ఇదివరకు పేర్కొంది. ఈ విషయంలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే ఇప్పుడు కేంద్రమే ఓ కమిటీ వేస్తామని ప్రకటించడంతో ఎల్జీబీటీ కమ్యూనిటీ సంతోషం వ్యక్తం చేస్తోంది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేకపోవడంతో వారు ఏ పథకాలకు కూడా అర్హులు కాలేకపోతున్నారు. భార్య, లేదా భర్త అనే కాలమ్ లో జీవిత భాగస్వామి పేర్లు ఎంటర్ చేయించుకోలేకపోతున్నారు. కనీసం బీమా పాలసీల్లో కూడా జీవిత భాగస్వామి పేరుని ఉంచలేరు. సమాజంలో చిన్నచూపుని తట్టుకుని నిలబడగలిగినా, అటు ప్రభుత్వం కూడా తమని గుర్తించకపోవడంతో ఇలాంటి వివాహాలు చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ వల్ల ఎల్జీబీటీ కమ్యూనిటికీ మేలు జరుగుతుందనేది వారి ఆశ. ఇప్పటి వరకూ ఈ వివాహాల పట్ల వ్యతిరేకంగా ఉన్న కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం స్వలింగ వివాహాలు చేసుకునేవారికి మేలు జరుగుతుందని చెప్పొచ్చు.