మోడీని అభినందిస్తూనే చురకలు వేసిన ఉద్ధవ్
మహారాష్ట్ర కు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించడం వల్ల ఈ పలితాలు సాధ్యమయ్యాయని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో ఓట్లను చీల్చడం కూడా బిజెపికి లాభపడిందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
గుజరాత్ లో బిజెపి విజయం సాధించినందుకు ప్రధాని మోడీని యుబిటి శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అభినందించారు. ఇదే సందర్భంలో ఆయన బిజెపి విజయం పట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర కు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించడం వల్ల ఈ పలితాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు.
'మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించిన ప్రాజెక్టులు కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి' అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇటీవల గుజరాత్‌లో కొన్ని భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను రాష్ట్రం కోల్పోవడంపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు బిజెపిని లక్ష్యంగా చేసుకుని విమర్శలుల గుప్పించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో ఓట్లను చీల్చడం కూడా బిజెపికి లాభపడిందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
ఈ నెల 11న మోడీ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయ్ మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని ఉద్దవ్ అన్నారు.
గుజరాత్‌లో ఫలితాలు ఊహించినవేనని, ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే కారణమని ఠాక్రే అన్నారు. 'గుజరాత్‌లో రికార్డులు బద్దలుకొట్టడం, చరిత్రాత్మక విజయం సాధించినందుకు నేను బీజేపీని, ప్రధాని మోడీని అభినందిస్తున్నాను' అని ఆయన అన్నారు.