లంచంలో వాటాలకోసం రోడ్డుపైనే కొట్టుకున్న పోలీసులు
బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసుల మధ్య లంచం విషయంలో వివాదం రేగింది. అది కూడా ఏదో గుట్టుగా కాదు.. వాటాల కోసం ఇద్దరూ రోడ్డెక్కారు.
ఒక పోలీసు సామాన్యుడిని కొడితే మనకు అలవాటైపోయిందని కాబట్టి రొటీన్ గానే చూస్తాం.. ఎందుకంటే ఒక్కోసారి పోలీసులు అతిగా రియాక్ట్ అవుతారు, లాఠీ పవర్ చూపిస్తారు అని తెలుసు కాబట్టి. కానీ, ఇద్దరు పోలీసులు కొట్లాడుకుంటే వింతే మరి. అది కూడా మరీ జనాల దగ్గరి నుంచి వసూలు చేసిన లంచం పంపకాల విషయంలో, రోడ్డుమీదే ఒకరిని ఒకరు కసిగా కొట్టేసుకుంటే అది మరీ వింత.
బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసుల మధ్య లంచం విషయంలో వివాదం రేగింది. అది కూడా ఏదో గుట్టుగా కాదు.. వాటాల కోసం ఇద్దరూ రోడ్డెక్కారు. మాటామాటా పెరగడంతో హైవే పైన తమ వాహనాన్ని ఆపి ఇద్దరూ కిందకు దిగారు. వేసుకున్నది యూనిఫామ్ అన్న జ్ఞానం లేకుండా చొక్కాలు పట్టుకుని మరీ పోలీసులు కొట్టుకుంటుండటంతో హైవే పైన వెళుతున్న వాహనదారులు కూడా ఆగి చోద్యం చూశారు. వీడియోలు తీశారు.
ఒకరేమో కోపం చల్లారక పోలీస్ వాహనంలోని లాఠీని తీసుకొచ్చి కొట్టేందుకు ప్రయత్నించగా మరో పోలీసు ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను విరిచి దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఇదంతా అక్కడున్న వారు తమ మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. గొడవ సమయంలో ఉన్నతాధికారులకు విషయం తెలిస్తే సస్పెండ్ చేస్తారని స్థానికులు వారించినా వారు వినిపించుకోలేదు. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో బీహార్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఇప్పటికే వారిద్దరినీ పోలీస్ సెంటర్ కు పిలిపించామని, విచారణ జరిపి ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే వారి మధ్య గొడవ ఎందుకు జరిగింది అనే విషయం మాత్రం పోలీసులు బయట పెట్టలేదు.