యూపీలో మరో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు జైలుకు.. ఒకరి ఎంపీ సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్

2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఘాజీపూర్ లోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు దోషిగా తేల్చింది.

Advertisement
Update:2023-04-29 19:07 IST

ఉత్తరప్రదేశ్ లో రౌడీల ఏరివేత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఆ రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్లు, రౌడీలపై ఎఫ్ఐఆర్ ల నమోదు భారీగా పెరిగింది. ఎన్‌కౌంటర్లతో వందలాదిమంది రౌడీలు చనిపోతున్నారు. మరికొందరు న్యాయస్థానాల తీర్పుతో జైలుకు వెళ్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయ నాయకులుగా చలామణి అయిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు కోర్టు జైలు శిక్ష విధించింది. వారిలో ఒక ఎంపీ కూడా ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆ ఎంపీ లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దు కానుంది.

2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఘాజీపూర్ లోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. మొదట్లో గ్యాంగ్ స్టర్ గా ఉన్న ముక్తార్ అన్సారీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కాగా, ఈ కేసులో ముక్తార్ అన్సారీ సోదరుడు ప్రస్తుతం ఘాజీపూర్ ఎంపీగా ఉన్న అఫ్జల్ అన్సారీని కూడా కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. కోర్టు తీర్పుతో అఫ్జల్ అన్సారీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధన ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన రోజు నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు తర్వాత రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు జైలు శిక్షపడ్డ అఫ్జల్ అన్సారీ ఎంపీ సభ్యత్వం కూడా త్వరలో రద్దయ్యే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News