2 ఇండియాస్.. మోదీ స్నేహితులపై రాహుల్ సెటైర్లు..
ఆత్మహత్యల అవస్థ ఉన్న దేశాన్ని పేద భారతంగా వర్ణించారు. మరోవైపు ధనిక భారత్ కూడా ఉంది. అందులో మోదీ స్నేహితులు మాత్రమే ఉంటారు. మోదీ స్నేహితులు గంటకు తమ ఆదాయాన్ని 85కోట్ల రూపాయల మేర పెంచుకుంటున్నారు.
బీజేపీ పాలనలో రెండు ఇండియాలున్నాయని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. ఒకటి పేద ఇండియా, మరొకటి ధనిక ఇండియా అని చెప్పారు. ఈ రెండు ఇండియాస్ కేవలం బీజేపీ పాలన వల్లే సాధ్యమయ్యాయని అన్నారాయన. పేదల భారతం, ధనవంతుల భారతంగా దేశాన్ని రెండు విధాలుగా బీజేపీ మార్చేస్తోందంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
భారత్ లో ప్రతి గంటకు ఐదుగురు రోజు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు రాహుల్ గాంధీ. నిత్యావసరాలకోసం కూడా వారు సంపాదించుకోలేకపోతున్నారని, మరోవైపు ఖర్చులు పెరుగుతున్నాయని, అందుకే కుటుంబాన్ని పోషించలేక కూలీలు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలేనని విమర్శించారు రాహుల్. ఆత్మహత్యల అవస్థ ఉన్న దేశాన్ని పేద భారతంగా వర్ణించారు. మరోవైపు ధనిక భారత్ కూడా ఉంది. అందులో మోదీ స్నేహితులు మాత్రమే ఉంటారు. మోదీ స్నేహితులు గంటకు తమ ఆదాయాన్ని 85కోట్ల రూపాయల మేర పెంచుకుంటున్నారు. ఇలా మోదీ స్నేహితులు మాత్రమే ధనవంతులవుతున్న దేశాన్ని ధనిక భారత్ గా పేర్కొన్నారు రాహుల్.
టార్గెట్ అదానీ, టార్గెట్ మోదీ..
ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి అదానీ ఎదిగారన్న వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇలా సెటైర్లు వేశారు. కేవలం మోదీకి స్నేహితులు కావడం వల్లే వారు ఆ స్థానంలో ఉన్నారంటూ పరోక్షంగా అదానీపై సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. తన స్నేహితుల్ని ధనవంతుల్ని చేసేందుకు సామాన్యులను మోదీ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఓ వైపు సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. మోదీ స్నేహితులు మాత్రం మరింత కుబేరులు అవుతున్నారన్నారు. #Twoindias అనే హ్యాష్ ట్యాగ్ జతచేస్తూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.