రైల్వేలో టికెట్లు.. వాయిదాల్లో చెల్లింపులు

రైల్వేకి చెందిన ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 6 నెలలు లేదా 8 నెలల్లో టికెట్ డబ్బులు చెల్లించవచ్చు.

Advertisement
Update:2022-10-21 14:14 IST

టికెట్టుకి సరిపడా డబ్బుల్లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు..? ప్రయాణం వాయిదా వేసుకుంటారు. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు రైల్వే అధికారులు. టికెట్‌కి సరిపడా డబ్బులు లేకపోయినా రైల్వే ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అవును, ముందు ప్రయాణించండి, తర్వాత డబ్బులు కట్టండి (TNPL) అంటూ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. క్యాష్-ఇ అనే సంస్థతో చేతులు కలిపిన రైల్వే.. టికెట్లను ఈఎంఐ పద్ధతిలో ఇస్తామని చెబుతోంది.

రైల్వేకి చెందిన ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 6 నెలలు లేదా 8 నెలల్లో టికెట్ డబ్బులు చెల్లించవచ్చు. కొంతమొత్తం చెల్లించవచ్చు, లేదా పూర్తి మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే విధంగా ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకునే విధానంపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

ఎవరికి లాభం..

ఈ పద్ధతి ద్వారా ఎవరికి లాభం అనేది ముందు ముందు తేలుతుంది. అసలిది రైల్వేకి అనుకూలమా కాదా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రైల్వే ఈఎంఐ సదుపాయం ఇస్తామంటోంది. అంటే, ఎవరైనా దర్జాగా టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేయొచ్చు. ఆ తర్వాత ఈఎంఐలు చెల్లించకపోతే చివరిగా రైల్వేకే నష్టం వచ్చే అవకాశముంది. ఈఎంఐల కోసం క్రెడిట్ కార్డ్ సంస్థలు, లేదా బ్యాంకుల్లాగా ఐఆర్సీటీసీ పీడించే అవకాశం లేదు. అంటే, టికెట్ తీసుకున్నవారు బాకీ తీర్చాలా లేదా అనేది వారి విచక్షణపై ఆధారపడి ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. టికెట్ ఏజెన్సీలు ఈఎంఐ పద్ధతిని బాగా ఉపయోగించుకునే అవకాశముంది. ఏజన్సీలకు ఇది ఒక రకంగా వరమనే చెప్పాలి. ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన ఈపద్ధతిని ఎంత మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News