రేపు పవార్-నితీష్ భేటీ..స్పీడందుకుంటున్న విపక్షాల యూనిటీ
ఈ మధ్యే ఎన్డీఏ తో తెగతెంపులు చేసుకొన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపక్షాల ఐక్యత కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన రేపు ఢిల్లీ రానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా వివిధ విపక్ష నాయకులతో సమావేశం అవుతారు.
భారతీయ జనతా పార్టీ(బిజెపి) విధానాలకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా చర్చలు ఊపందుకుంటున్నాయి. బిహార్ లో గత నెలలో జరిగిన పరిణామాలతో విపక్షాలలో ఉత్సాహం పెరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ చర్యలకు దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ పలు విపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలకంగా వ్యవహరిస్తూ విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు,కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల నాయకులతో సంప్రదింపులు జరిపారు. తాజాగా ఆయన బిహార్ ముఖ్యమంత్రి, జెడియు నేత నితీష్ కుమార్ తో భేటి అయ్యారు. బిజెపి ముక్త్ భారత్ కోసం ఈ భేటీలో నేతలు ఇరువురు ప్రతిజ్ఞ చేశారు. నితీష్ కుమార్ బిజెపి తీరుపై మండిపడుతున్నారు. స్నేహంగా ఉంటూనే వెన్నుపోటు పొడిచే నైజం బిజెపిదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అరుణా చల్ ప్రదేశ్ లో, తాజాగా మణిపూర్ లోనూ తమ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసిన తీరుపై నితీష్ నిప్పులు కక్కుతున్నారు.
ఏది ఏమైనా బిజెపికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. జెడియు జాతీయకార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పై ధ్వజమెత్తారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి 50 సీట్లు కంటే ఎక్కువ వచ్చేపరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇందు కోసం తాను అన్ని విధాల కృషి చేస్తానని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్ళి ముఖ్య నాయకులతో విపక్షాల ఐక్యతపై చర్చిస్తానని చెప్పారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని జెడియూ కార్యవర్గ సమావేశం తీర్మానించింది.
సోమవారంనుంచి ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తో కూడా సమావేశమవుతానని చెప్పారు. ఈ క్రమంలోనే రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సిపి) అధినేత శరద్ పవార్ తో భేటీ కానున్నారు. తాను ఏ పదవినీ ఆశించడంలేదని 82 యేళ్ళ పవార్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ రాజకీయ దిగ్గజాలు భేటి కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. గత నెలలో బిజెపి తో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులు ఆర్జెడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఇరువురు నేతలు కలవడం ఇదే ప్రధమం. బిజెపియేతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తారు. శరద్ పవార్ ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో బిజెపి ప్రత్యమ్నాయ కూటమి ఏర్పాటుకు గల సాధ్యా సాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. నితీష్ కుమార్ కూడా బిజెపీయేతర పార్టీలను, భావసారూప్యతగల పక్షాలను కూడగట్టేందుకు తాను చేయాల్సింది అంతా చేస్తానని స్పష్టం చేశారు.
అదే సందర్భంగలో బిహార్ ను సుదీర్ఘ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, రాజనీతిజ్ఞుడిగా నితీష్ కుమార్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా నిలబడితే బాగుంటుందని పార్టీలో వినిపిస్తున్న అభిప్రాయాలను ఆయన పట్టించుకోవడంలేదు. బిజెపికి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని, తనకు ప్రధాని అభ్యర్ధి కావాలనే ఆకాంక్ష లేదని పలు సందర్భాలల్లో విస్పష్టంగా చెబుతూవస్తున్నారు.
పవార్ ,నితీష్ కుమార్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలతో ఇద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీని అంటరానిదానిగా పరిగణించకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా అందరితో మంచి స్నేహ సంబంధాలు నెరుపుతూ సంభాషిస్తుంటారు. అటువంటి ఇద్దరు సీనియర్ నాయకులు భేటీలో ఉపయోగకరమైన ఫలితం వస్తుందని భావిస్తున్నారు. శివసేన కూడా విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యత ఉందని ఇటీవల ప్రకటించింది.
రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నదని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వీరిద్దరూ పదేపదే దుయ్యబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బిజెపి ప్రదర్శిస్తున్న దూకుడు, విపక్ష పాలిత రాష్ట్రాలపై విరుచుకుపడుతూ ఇబ్బందులు పెడుతున్న తీరుతో ప్రతిపక్షాలన్నీ మరింత త్వరగా ఏకం కావడానికి మార్గం సులభమవుతోంది. రానున్న రోజుల్లో విపక్షాలుఏకమై బిజెపికి వ్యతిరేకంగామరింత బలపడనున్నాయనడంలో సందేహం లేదు.