రోడ్డుపై గుంతలో పడి కారు డ్యామేజ్.. రూ. 50వేల చెల్లించాలని కన్జ్యూమర్ కోర్టు ఆదేశం

కిచ్లూనగర్‌కు చెందిన స్మిత జిందాల్ అనే మహిళ ఢిల్లీ నుంచి లుథియానా వెళ్తుండగా ఖన్నా అనే గ్రామం దగ్గర హైవేపై గుంతలో కారు పడి డ్యామేజ్ అయ్యింది.

Advertisement
Update:2022-10-27 16:18 IST

రోడ్డుపై ఉన్న గుంతను సకాలంలో పూడ్చక పోవడం వల్లే తన కారు డ్యామేజ్ అయ్యిందని ఓ మహిళ వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది. రోడ్డు నిర్వహణకు టోల్ వసూలు చేస్తున్న కంపెనీనే తన కారు బాగు చేయించాలని ఆమె పిటిషన్‌లో కోరింది. గత ఆరేళ్లుగా విచారణ కొనసాగిన అనంతరం కారు యజమానురాలికి అనుకూలంగా లుథియానా జిల్లా కన్జ్యూమర్ కోర్డు తీర్పు చెప్పింది. రూ. 50,000 జరిమానాను ఏడాదికి 8 శాతం వడ్డీతో చెల్లించాలని సోమవా ఐసోలెక్స్ అనే కంపెనీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..

కిచ్లూనగర్‌కు చెందిన స్మిత జిందాల్ అనే మహిళ ఢిల్లీ నుంచి లుథియానా వెళ్తుండగా ఖన్నా అనే గ్రామం దగ్గర హైవేపై గుంతలో కారు పడి డ్యామేజ్ అయ్యింది. దీంతో నవంబర్ 2016లో ఆమె కన్జ్యూమర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ కేసును జిల్లా కన్జ్యూమర్ కోర్డు విచారణకు స్వీకరించింది. జాతీయ రహదారుల నిర్వహణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పలు సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చిందని, టోలు వసూలు చేయడమే కాకుండా రోడ్ల మరమ్మతులు కూడా వారే నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో నేషనల్ హైవే రోడ్ల నిర్వహణ చేపట్టినప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు మారిన నిబంధనలకు అనుగుణంగా కన్జ్యూమర్ కోర్టుల్లో కేసులు వేసే వెసులు బాటు ఉందని బాధితురాలి తరుపు న్యాయవాది హరి ఓం జిందాల్ వాదించారు.

నేషనల్ హైవే ఉండే హైకోర్టు పరిధిలో రిట్ పిటిషన్ వేయాలనే నిబంధన కారణంగా అప్పట్లో చాలా మంది రోడ్ల కారణంగా బాధితులుగా మారినా పెద్దగా పిటిషన్లు వేయలేదని తెలిపారు. ఢిల్లీ-లుథియానా హైవేను సోమా కంపెనీ నిర్వహిస్తోందని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో ఆ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నదని తెలిపారు. టోలు వసూలు చేస్తూ.. రోడ్ల నిర్వహణ మాత్రం సరిగా చేయడం లేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి సోమా కంపెనీ తప్పిదమే అని తెలిపారు. బాధితురాలి న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు సోమా కంపెనీకి రూ. 50,0000 జరిమానా 8 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా సదరు మొత్తాన్ని బాధితురాలికి అందించాలని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News