బాదుడే బాదుడు.. ఏప్రిల్-1నుంచి టోల్ చార్జీలు పెంపు..!

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నెల చివరి వారంలోపు చార్జీల పెంపు అంశాన్ని పరిశీలించి ఆమోదించే అవకాశం ఉంది. తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్‌ చార్జీ అదనంగా వడ్డిస్తారు.

Advertisement
Update:2023-03-05 21:35 IST

ఇటీవల గ్యాస్ సిలిండర్ రేటు భారీగా పెంచి.. పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచిన కేంద్రం, తాజాగా మరో అస్త్రం సిద్ధం చేసింది. ఏప్రిల్-1నుంచి టోల్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు కానీ, చార్జీల పెంపు మాత్రం అనివార్యం అని స్పష్టమవుతోంది. టోల్ రేట్లు 5నుంచి 10శాతం వరకు పెరుగుతాయని అంచనా.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లపై టోల్ చార్జీలు పెంచడానికి నిర్ణయించింది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్‌ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. ఇది కాకుండా ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాలు మారే అవకాశం కూడా ఉంది. ఈసారి కూడా ఏప్రిల్ 1నుంచి చార్జీలు పెంచే అవకాశం ఉన్నట్టు కథనాలు వినపడుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నెల చివరి వారంలోపు చార్జీల పెంపు అంశాన్ని పరిశీలించి ఆమోదించే అవకాశం ఉంది. తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్‌ చార్జీ అదనంగా వడ్డించే అవకాశముంది.

టోల్ పాస్ ల రుసుము పెంపు..

టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్‌ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్‌ లు జారీ చేస్తుంటారు. ప్రస్తుతానికి నెలకు రూ.315 చెల్లిస్తే ఈ పాస్ ఇస్తారు. ఈసారి ఏప్రిల్-1నుంచి ఈ పాస్‌ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. వీలైనంతగా బాదుడే బాదుడు అమలు చేస్తున్న కేంద్రం, టోల్ రేట్లను కూడా భారీగా పెంచి వాహనదారుల నడ్డివిరిచేందుకు సిద్ధమైంది. టోల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్ గానే రవాణా మరింత భారమవుతుంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News