నేడు ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల భేటీ
వర్తమాన రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై చర్చించే అవకాశం
ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు.
అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్‌కు గట్టిగా సమాధానం ఇచ్చే అంశంపైనా ఎన్డీఏ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించిన జమిలి ఎన్నికల బిల్లుపై, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.