పోటెత్తిన వరద.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతి – ఢిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో ఘటన
ఒక్కసారిగా పోటెత్తిన వరద సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వెళ్లడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కసారిగా పోటెత్తిన వరద సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వెళ్లడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఢిల్లీలోని ఢిల్లీలో ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన సమయంలో గ్రంథాలయంలో దాదాపు 30 మంది ఉండగా.. తెలంగాణకు చెందిన తానియా సోనీ (21), ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నెవిన్ డెల్విన్ (29) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ చాలా వరకు దెబ్బతినడంతో వరద పోటెత్తిన రాజిందర్‌నగర్ ప్రాంతంలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఈ భవనం గ్రౌండ్ లెవల్ కంటే బేస్‌మెంట్‌కు 8 అడుగుల దిగువన ఉంది. ప్రమాద సమయంలో బేస్‌మెంట్ గేటు మూసి ఉన్నప్పటికీ వరద ఉధృతికి అది ధ్వంసమైంది. దీంతో నీరు ఒక్కసారిగా అధిక ఒత్తిడితో లోపలికి ప్రవేశించింది. ఆ సమయంలో గ్రంథాలయంలో ఉండి చదువుకుంటున్న దాదాపు 30 మంది విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బయటకు వెళ్లే మార్గం లేక రక్షించాలంటూ కేకలు వేశారు. స్థానికులు తాళ్లు అందించడంతో కొందరు వాటి సాయంతో బయటకు వచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది 7 గంటల పాటు శ్రమించి నీటిని చాలా వరకు తోడివేశారు. ఆదివారం తెల్లవారుజామున నీటి అడుగున పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం కోసం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో తానియా సోనీ స్వస్థలం బిహార్‌లోని ఔరంగాబాద్. ఆమె తండ్రి ప్రస్తుతం తెలంగాణలో ఓ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న తానియా 45 రోజుల క్రితమే రావూస్ స్టడీ సర్కిల్లో చేరారు. ఆమెకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ఆదివారం తానియా తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని ఔరంగాబాదుకు తీసుకెళ్లారు. ఇక శ్రేయ యాదవ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్. ఆమె బీఎస్సీ–అగ్రికల్చర్ చదివారు. ఆమె ఈ ఏడాది మే నెలలో రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో చేరారు. శ్రేయ యాదవ్ మరణం గురించి తమకు ఎవరూ
సమాచారం ఇవ్వలేదని, టీవీ చానళ్లలో చూసి వచ్చామని ఆమె బంధువు ధర్మేందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో మృతుడు నెవిన్ డాల్విన్ కేరళ వాసి. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న నెవిన్ 8 నెలల క్రితం సివిల్స్ కోసం రావూస్‌లో చేరారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కో– ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు.