అక్కడ ఫోన్లు పనిచేయవు.. ఢిల్లీలో వెయ్యి డార్క్ స్పాట్స్..

ఆ సమస్యలను అధిగమించేందుకు ఆయా ప్రాంతాల్లో వెయ్యి నెట్ వర్క్ బూస్టర్లను అమర్చడానికి సిద్ధమయ్యారు అధికారులు.

Advertisement
Update:2022-07-19 17:44 IST

ఢిల్లీ మహానగరంలో సడన్‌గా కొన్ని చోట్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ రావు, అయితే సిగ్నల్స్ లేవు, నెట్ వర్క్ పనిచేయట్లేదు అనే విషయం మనం గ్రహించేలోపే అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ ఆయా ప్రదేశాల్లో ఉన్నవారు మాత్రం నిత్యం నెట్ వర్క్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ విభాగం(PWD) వాటిని డార్క్ స్పాట్స్ గా గుర్తించింది. ఒకటి కాదు రెండు కాదు ఢిల్లీలో ఇలాంటి డార్క్ స్పాట్స్ వెయ్యికి పైగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం PWD అధికారులు నెట్ వర్క్ బూస్టర్లను అమర్చడానికి సిద్ధమయ్యారు.

ఢిల్లీలాంటి రద్దీ నగరాల్లో ఎన్ని టవర్లు పెట్టినా నెట్ వర్క్ షేరింగ్ బలహీనంగా ఉంటుంది. అందులోనూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, టన్నెల్స్.. వద్ద నెట్ వర్క్ దాదాపుగా ఆగిపోతుంది. ఆ సమస్యలను అధిగమించేందుకు ఆయా ప్రాంతాల్లో వెయ్యి నెట్ వర్క్ బూస్టర్లను అమర్చడానికి సిద్ధమయ్యారు అధికారులు.

సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా ఏపని కూడా ముందుకు సాగదు. డార్క్ స్పాట్స్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు అధికారులు. సమయానికి వైద్య సహాయం, లేదా పోలీస్ సహాయం కావాల్సినవారు కనీసం ఫోన్ చేయడానికి కూడా కుదరని పరిస్థితి. పోలీసులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ డార్క్ స్పాట్స్ ఉన్న ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు జరిగినా త్వరగా పోలీసులకు సమాచారం అందేది కాదు. దీంతో నెట్ వర్క్ సమస్యల పరిష్కారానికి అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లోని కరెంట్ పోల్స్ కి నెట్ వర్క్ బూస్టర్స్ ని ఇన్ స్టాల్ చేయబోతున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్, సిగ్నేచర్ బ్రిడ్జ్, ఔటర్ రింగ్ రోడ్, ITO బ్రిడ్జ్, లజ్‌ పత్ నగర్ మార్కెట్, మీరాబాగ్ తదితర ప్రాంతాల్లో ఈ ప్రయోగం చేయబోతున్నారు. దీనికోసం ఇప్పటికే PWD విభాగం టెండర్లు పిలిచింది.

Tags:    
Advertisement

Similar News