ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదు..ఏకనాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోమహాయుతి కూటమి భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి ఎవరు అనేదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం సీఎం ఏకనాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని ఏమి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీట్లకు, సీఎం పదవికి సంబంధం లేదు.. ముఖ్యమంత్రి పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక్కరు ఉంటేనే భద్రంగా ఉంటుంది.. అది మోదీ వల్లే సాధ్యం’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్ట్‌కు మహారాష్ట్ర హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ప్రస్తుతం ఫడ్నవీస్ పోస్ట్ వైరల్‌గా మారింది.కాగా, కూటమిలోని పెద్ద పార్టీ అయిన బీజేపీనే ఈ సారి ముఖ్యమంత్రి పదవి చేపడుతుందన్న ప్రచారం జరుగుతోంది.
దీన్ని బట్ట చూస్తే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే మహా తదుపరి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏక్‌నాథ్ షిండే నే మహారాష్ట్ర తదుపరి సీఎం అని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంగా మారింది. మహా అసెంబ్లీ గడువు ఈనెల 26తో ముగియనున్న విషయం తెలిసిందే. గెలిచిన వాళ్లు 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహా తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై మరో రెండు లేదా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.