అద్వానీకి భారతరత్న.. అసలు మ్యాటర్ ఇదీ!

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అటు బీజేపీ, ఇటు మోడీ అత్యంత శక్తివంతంగా తయారయ్యారు. దాంతో సహజంగానే అద్వానీ సహా సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది.

Advertisement
Update:2024-02-03 14:17 IST

మాజీ ఉపప్రధాని, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఎల్కే అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం అని కొనియాడారు. అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందన్నారు. "మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయనది గొప్ప జీవితం. పార్లమెంట్‌లో ఆయన పాత్ర ఆదర్శప్రాయం" అని మోడీ కొనియాడారు.

1990లో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ.. అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అద్వానీకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు ఆయన దేశ ప్రధాని అయ్యేవారే. ఆ సమయంలో వాజ్‌పేయ్ వల్ల అద్వానీ ఉప ప్రధానిగా మిగిలిపోయారు. తర్వాత మోడీ శకం మొదలైంది. దాంతో బీజేపీ లోని సీనియర్లు కాస్త వెనక్కి తగ్గారు. అద్వానీ కూడా అయిష్టంగానే మోడీకి దారి ఇచ్చారనే చర్చ ఉంది.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అటు బీజేపీ, ఇటు మోడీ అత్యంత శక్తివంతంగా తయారయ్యారు. దాంతో సహజంగానే అద్వానీ సహా సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. పవర్‌లోకి వచ్చాక మోడీ, అమిత్‌షాలు అద్వానీని పూర్తిగా ప‌క్క‌కు పెట్టేశారనేది జగమెరిగిన సత్యం. మొన్నటికి మొన్న రామమందిర నిర్మాణ ప్రారంభానికి కూడా అద్వానీకి ఆహ్వానం పంపలేదు. రామమందిరం కోసం అన్నీతానై వ్యవహరించిన అద్వానీకే ఆహ్వానం అందకపోవడం దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ తరుణంలో మోడీపై వ్యతిరేకత మరింత ఎక్కువైంది. అధికార అహంతో గురువును పక్కన పెట్టేశారని విమర్శలు తీవ్రం అవుతున్న వేళ.. మోడీ మరోసారి తన మార్క్ చూపించారు. ఎన్నికలకు ముందు విమర్శలన్నింటికీ చెక్‌ పెడుతూ దేశ అత్యున్నత పురస్కారంతో అద్వానీని సత్కరించుకున్నారు.

Tags:    
Advertisement

Similar News