సీబీఐకి అనుమతి ఇవ్వని 9 రాష్ట్రాలు ఇవే

సీబీఐ ఎంట్రీకి బ్రేక్‌ వేసిన రాష్ట్రాల్లో బీజేపీయేతర‌ పార్టీలే అధికారంలో ఉన్నాయి. సీబీఐని తన చేతిలో ఉంచుకున్న కేంద్రం.. దాని ద్వారా తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయోగిస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

Advertisement
Update:2022-12-15 08:16 IST

దేశంలో మొత్తం 9 రాష్ట్రాలు కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ ఎంట్రీకి అనుమతి నిరాక‌రించిన‌ట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌కు తెలియజేశారు. ముందస్తు అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను సీబీఐ నేరుగా దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ ఈ 9 రాష్ట్రాలు స్ప‌ష్టం చేశాయ‌ని వెల్లడించారు.

సీబీఐ ఏర్పడిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నేరాలను సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధారణ అనుమతి తప్పనిసరి అని వివరించారు.

సీబీఐ ఎంట్రీకి బ్రేక్‌ వేసిన రాష్ట్రాల్లో బీజేపీయేతర‌ పార్టీలే అధికారంలో ఉన్నాయి. సీబీఐని తన చేతిలో ఉంచుకున్న కేంద్రం.. దాని ద్వారా తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయోగిస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర దర్యాప్తు సంస్థకు అనుమతి నిరాకరించాయి.

తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్,రాజస్థాన్‌, మిజోరాం, మేఘాలయ, ఛ‌త్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఇది వరకు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని వెనక్కు తీసుకుంది. అయితే జగన్‌ సీఎం అయిన తర్వాత ఎంట్రీకి అనుమతిని పునరుద్ధరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సీబీఐ ఎంట్రీకి సాధారణ అనుమతిని నిరాకరించింది.

Tags:    
Advertisement

Similar News