సావర్కర్ పేరు ఎత్తితే కాషాయ పరివారానికి ఉలుకు ఎందుకు..?
దాదాపు పదేళ్ళపైన అండమాన్ జైల్లో కఠిన కారాగారవాసంలో గడిపిన సావర్కర్ త్యాగం బ్రిటీషు వారికి బేషరతుగా లొంగిపోవడంతో వృథా అయింది.
చరిత్రని మార్చలేరు, ఏమార్చలేరు. వినాయక్ దామోదర్ సావర్కర్ ముమ్మాటికీ బ్రిటీష్ ఏజెంటుగా పనిచేశాడన్నది వాస్తవం. బ్రిటీష్ వారి శరణు కోరిన సావర్కర్ జాతీయవాద ప్రతినిధి కాదన్నది తిరుగులేని నిజం. అండమాన్ జైలు నుంచి విడుదల కోసం ఒకసారి కాదు, ఏకంగా నాలుగుసార్లు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. 1911లో, 1913లో, 1917లో, 1920లో తనని క్షమించి విడుదల చేస్తే, బ్రిటీష్ వారి ప్రభుత్వానికి కట్టుబడి నడుచుకుంటానని దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలు చెక్కుచెదరకుండా ఉండగా, వి.డి.సావర్కర్‌ని దేశభక్తునిగా, సిసలైన జాతీయవాదిగా అభివర్ణించడం వాస్తవ విరుద్ధం. కనుకనే సావర్కర్‌ని అభిశంసిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడటంలో తప్పేం లేదు.
సావర్కర్ చరిత్రని గమనిస్తే మొదట తాను బాలగంగాధర్ తిలక్ అతివాద భావాలతో ప్రభావితమై విద్యార్థిగా ఉండగానే ఉద్యమాల్లోకి చురుకుగా ముందుకు వచ్చాడు. తొలుత విప్లవవాదిగా జీవితాన్ని ఆరంభించిన వీరసావర్కర్ విద్రోహిగా మారడమే చారిత్రక అభాస. పూణేలో ఉండగా చత్రపతి శివాజీ స్కాలర్‌షిప్ పొంది విద్యనభ్యసించిన ఆయన పైచదువుల కోసం 1906లో లండన్ వెళ్ళాడు. అక్కడా భారత స్వాతంత్య్రం కోసం పోరాడే విప్లవ సంస్థలతో కలిసి పోరాటాల్లో పాల్గొన్నాడు. భారత సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పిలుపునిస్తూ 'ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' అనే పుస్తకం రాశారు. దీనితో పాటు సావర్కర్ రాసిన 'ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857' పుస్తకాన్ని నాటి బ్రిటీష్ పాలకులు నిషేధించారు.
ఆ తరువాత అతను విప్లవకారులకు ఆయుధాలు సరఫరా చేయడం, స్వాతంత్య్రం కోసం ఉగ్రవాద, గెరిల్లా తరహా పోరాటాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం అతని అరెస్టుకు దారితీసింది. అయినప్పటికీ ఒకటీ రెండుసార్లు తప్పించుకున్నాడు. రాజద్రోహ నేరం కింద, నాసిక్ జిల్లా కలెక్టర్ ఏ.ఎం.టి. జాక్సన్ హత్యకు తోడ్పడ్డాడనే అభియోగాల కింద బ్రిటీషు ప్రభుత్వం సావర్కర్‌కు 50 ఏళ్ళ కఠిన కారగార శిక్ష విధించి 04 జూలై 1911న అండమాన్ సెల్యూలర్ జైలుకు పంపించింది. అప్పుడు సావర్కర్ వయసు కేవలం 28 సంవత్సరాలు.
అండమాన్ జైలు అతి భయానకమైనది. రాజకీయ ఖైదీ అయినప్పటికీ ఎలాంటి వసతులు లేకపోవడం, దుర్భరమైన జైలు జీవితం సావర్కర్‌ను కుంగదీసింది. కనుక తనకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయవలసిందిగా కోరుతూ 30 ఆగస్టు 1911న దరఖాస్తు చేసుకున్నాడు. అంటే అండమాన్ జైలుకు వచ్చి రెండు నెలలు కాకముందే బ్రిటీషు వారి శరణు కోరడం గమనార్హం. అయితే ఆయన పిటిషన్‌ను 03 సెప్టెంబర్ 1911న తిరస్కరించింది నాటి వలస ప్రభుత్వం. అయినప్పటికీ తన విడుదల కోసం సావర్కర్ అనేకసార్లు మొరపెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మరో మూడుసార్లు ప్రాధేయపడ్డాడు. తనని విడుదల చేస్తే బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారి మనసు మార్చడానికి ప్రయత్నిస్తానని, మరల ఎప్పుడూ భారత స్వాతంత్య్రం కోసం పోరాడనని కూడా పిటిషన్‌లో పేర్కొనడం అతి హేయమైంది. కనుకనే విప్లవకారుడయిన సావర్కర్‌ను విద్రోహిగా మారాడంటారు.
చివరకు అనేక విజ్ఞప్తుల ఫలితంగా అతని దరఖాస్తులని పరిశీలించి 1921లో అండమాన్ నుంచి రత్నగిరి జైలుకు తరలించారు. ఆ తరువాత 1924 జనవరి 6న పూర్తిగా విడుదల చేశారు. అయితే ఇందుకోసం బ్రిటీషు రాజ్యాంగానికి కట్టుబడి వుంటానని, హింసకు స్వస్తి చెబుతానని, మరెన్నడూ స్వాతంత్య్రం కోరబోనని ప్రమాణపూర్తిగా రాసి ఇచ్చాడు. ఇదే అసలు సిసలైన విద్రోహం. రత్నగిరిలో ఉండగానే 1921లోనే హిందూ మహాసభను స్థాపించాడు. హిందుత్వ రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. అతివాద హిందుత్వని ప్రబోధించాడు. నాథూరాం గాడ్సే వంటి వారిని ప్రభావితం చేశాడు సావర్కర్.
దాదాపు పదేళ్ళపైన అండమాన్ జైల్లో కఠిన కారాగారవాసంలో గడిపిన సావర్కర్ త్యాగం బ్రిటీషు వారికి బేషరతుగా లొంగిపోవడంతో వృథా అయింది. వీర విప్లవకారునిగా ఆరంభించిన ప్రయాణం విద్రోహపర్వంతో ముగియడమే అతని జీవితంలోని విరోధాభాస. కఠిన కారాగార వాసం భరించలేక క్షమాభిక్షని కోరాడని అర్థం చేసుకోవచ్చునేమో గానీ, విడుదల తరువాత అతని వ్యవహారశైలి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. హిందూత్వ పేరుతో విద్వేష, విభజన రాజకీయాలకు పాల్పడ్డాడు.
బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు నివ్వగా ఆ ఉద్యమంలో హిందువులు ఎవరూ పాల్గొనవద్దని కోరాడు సావర్కర్. దేశమంతటా బ్రిటిష్ పాలన మీద నిరసన వెల్లువ రాగా, బ్రిటిషువారి ఆదేశాలను అనుసరించాలని, రెండో ప్రపంచ యుద్ధంలో వారికి మద్దతుగా నిలబడాలని కోరాడు. బ్రిటిషు పాలకులకు అనుగుణంగా నడుచుకోవాలని, ముఖ్యంగా హిందువులంతా యుద్ధంలో బ్రిటిషు వారి తరఫున నిలబడాలని హిందూ మహాసభ తరఫున బహిరంగంగా పిలుపునిచ్చాడు. ఇంతకన్నా విద్రోహమేముంది. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడాలని 1911లో పుస్తకాలు రాసిన సావర్కర్ 1942లో అదే బ్రిటీషు వారి అడుగులకు మడుగులొత్తడం చారిత్రక తప్పిదం.
చరిత్ర తీర్పునిస్తుంది. కనుకనే హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ల తప్పిదాలను రాహుల్ తప్పు పట్టడం ముమ్మాటికీ సరయిందే. హిందూ మహాసభ, సావర్కర్ భావజాల ప్రభావం కారణంగానే గాంధీని పట్టపగలు నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు. కనుకనే గాంధీ వారసులు ఎవరో, గాడ్సే వారసులు ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సావర్కర్ మీద రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఏవీ అబద్ధాలు కాదు, సాక్ష్యాలతో కూడిన చారిత్రక వాస్తవాలు. చరిత్రని వక్రీకరించే కాషాయ పరివారం చరిత్ర గురించి నిజాలు మాట్లాడితే ఉలికి పడుతుంది. శివసేన కానీ, బిజెపి కానీ చరిత్రనీ మార్చలేదు, వక్రీకరించలేదు. ఎప్పటికయినా చరిత్రకు తలవంచాల్సిందే.