ఒక వైపు ఒరిగిపోతున్న ఎత్తైన శివాలయం.. కారణాలు అన్వేషిస్తున్న ఏఎస్ఐ

ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని గర్హ్వాల్ హిమాలయాల్లో తుంగనాథ్ ఆలయం ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో ఉన్నది.

Advertisement
Update:2023-05-17 12:36 IST

ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయానికి ఇప్పుడు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఈ ఆలయం ఐదు నుంచి ఆరు డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గుర్తించింది. గత కొన్నాళ్లుగా ఈ శివాలయానికి సంబంధించిన కట్టడంపై ఏఎస్ఐ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ఆలయం 6 డిగ్రీల మేర, దానికి సంబంధించిన చిన్న కట్టడాలు 10 డిగ్రీల మేరక పక్కకు ఒరిగినట్లు తేల్చారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని గర్హ్వాల్ హిమాలయాల్లో తుంగనాథ్ ఆలయం ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో ఉన్నది. ప్రపంచంలో మరే ఇతర శివాలయం ఇంత ఎత్తులో లేదు. ఇక్కడకు భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ శివాలయం కాస్త ఒరిగినట్లు గుర్తించిన స్థానికులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కొన్నాళ్లుగా ఆర్కియాలజీ అధికారులు గుడి పక్కకు ఒరిగిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

డెహ్రాడూన్ సర్కిల్ ఆర్కియాలజీ సూపరింటెండ్ మనోజ్ కుమార్ సక్సేనా ఈ విషయంపై స్పందించారు. శివాలయం పక్కకు ఒరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాము. అలాగే గుడికి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నాము. శివాలయ రక్షణ కోసం శాశ్వతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. శివాలయం ఉన్న ప్రాంతంలో భూమి ఏమైనా కుంగిపోయి ఇలా ఒరిగిపోయిందనే కారణాన్ని కూడా కొట్టిపారేయలేమని ఆయన చెప్పారు.

శివాలయానికి చెందిన పునాది రాళ్లు ఏమైనా డ్యామేజ్ అయి ఉంటాయేమో అని కూడా పరిశీలిస్తున్నారు. ఒక వేళ అదే నిజమైతే.. ఆధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించి పునాది రాళ్లను పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి శివాలయం ఒరగడం ఆగిపోయిందో లేదో తెలుసుకోవడానికి స్కేల్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. శివాలయానికి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తుంగనాథ్ ఆలయాన్ని కాత్యూరీ పాలకులు 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని బద్రి కేదార్ టెంపుల్ కమిటీ పర్యవేక్షిస్తున్నది.

Tags:    
Advertisement

Similar News