జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల దోసే ప్రణాళిక....సీఎం పై అనర్హ‌త వేటు ?

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అనర్హలుగా ప్రకటించేందుకు రంగం సిద్దమయ్యిందా ? పరిస్థితులు చూస్తూ ఉంటే అవుననే జవాబు వస్తోంది.

Advertisement
Update:2022-08-25 15:15 IST

విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసే బీజేపీ ఎత్తుగడల్లో భాగంగా ఇప్పటి వరకు మహారాష్ట్రలో విజయవంతంకాగా ఇప్పుడు జార్ఖండ్, ఢిల్లీలపై కన్నేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో ఏకంగా ముఖ్యమంత్రిపైనే అనర్హత వేటు వేయడానికి రంగం సిద్దం అయ్యింది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించి తనకు తాను మైనింగ్ లీజును పొడిగించుకున్నారని, అందువల్ల ఆయనను ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేతలు చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్‌కు పంపినట్లు సమాచారం.ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని ఈ ఉదయం జార్ఖండ్ రాజ్ భవన్‌కు సీల్డ్ కవర్‌లో పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో పిటిషనర్ అయిన భారతీయ జనతా పార్టీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9‍ఎ ని ఉల్లంఘించినందుకు హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం, ఒక రాష్ట్ర శాసన సభ సభ్యుడు ఏదైనా అనర్హతకు పాల్పడే చర్యలకు పాల్పడ్డారా లేదా అనే ప్రశ్న తలెత్తితే, నిర్ణయం కోసం గవర్నర్ కు పంపుతారు. అతని నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.

జార్ఖండ్ గవర్నర్ ఈ అంశాన్ని పోల్ ప్యానెల్‌కు రిఫర్ చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు గవర్నర్ ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఆ విధంగా జార్ఖండ్ గవర్నర్ పంపిన ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం సీల్డ్ కవర్ లో ఈ రోజు గవర్నర్ కు అందజేసింది.

కాగా ఈ అంశంపై స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్, ఎన్నికల కమిషన్ నివేదికను బీజేపీ నాయకులే తయారు చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నివేదిక సీలు చేయబడి ఉందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ నివేదికలోని అంశాలని కొందరు జర్నలిస్టులు, బీజేపీ నాయకులకు ఎలా తెలిసింది? వాళ్ళే ఈ నివేదికను తయారు చేశారా ? అని ఆయన ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News