సీఈసీ నియామక ప్యానెల్‌పై విచారణ.. వాయిదా కోరిన కేంద్రం
దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషన్ అభ్యంతరం
ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషన్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకున్నది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలిగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన విషయం విదితమే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే.. రాజ్యాంగ ధర్మానసం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోలిసిటర్ జనరల్ కాకుంటే.. 17మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకున్నది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.