‘ది కేరళ స్టోరీ’ మూవీపై విచారణకు ఆదేశించిన కేరళ సర్కార్
ఆ మూవీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీని విజయన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ అనిల్‌కాంత్ ఈ సినిమాపై దర్యాప్తు జరుపుతున్నారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ఆరెస్సెస్, బీజేపీ సినిమాలను కూడా ఉపయోగించుకుంటున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మరో మూవీ రిలీజ్ కానుంది. ఈ నెల 5వ తేదీన విడుదలకానున్న 'ది కేరళ స్టోరీ' మూవీ టీజర్, అందులోని డైలాగ్‌లు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఈ సినిమా విడుదలను నిషేధించాలని అందిన ఫిర్యాదులపై కేరళ సీఎం విజయన్ స్పందించారు.
ఆ మూవీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీని విజయన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ అనిల్‌కాంత్ ఈ సినిమాపై దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసుల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ మూవీ విడుదలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం విజయన్ తెలిపారు.కేరళలో ఉన్న మతసామరస్య వాతావరణాన్ని చెడగొట్టే లక్ష్యంతోనే సంఘ్ పరివార్ ఇలాంటి సినిమా రూపొందించిందని మంత్రి సాజి చెరియన్ కొల్లం ఆరోపించారు. మైనారిటీ వర్గాలపై అనుమానాలను కలుగజేసి సమాజంలో మతోన్మాదాన్ని, విభజనను తీసుకొచ్చే ఎజెండాతో ‘ది కేరళ స్టోరీ’ తీశారని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ మండిపడ్డారు.
కాగా, ఈ మూవీ వెనక పెద్ద కుట్ర ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న జరగనున్న కర్నాటక ఎన్నికల్లో ప్రభావం చూపడం, కేరళలో కాలుపెట్ట సందుదొరకని బీజేపీకి ఆ రాష్ట్రంలో బలాన్ని సమీకరించడం, మతకలహాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిలో మతకలహాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడం ఈ మూవీవెనక ఉన్న లక్ష్యాలని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి.