బిల్లులకు ఆమోదం తెలుపని గవర్నర్.. సుప్రీంలో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్

12 బిల్లులను నిర్ధేశిత సమయంలోగా ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం కోరింది.

Advertisement
Update:2023-11-01 09:40 IST

అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను గవర్నర్ వద్దకు పంపితే ఇంత వరకు ఆమోదించలేదని చెబుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధంగా గవర్నర్ తీరుతో విసిగిపోయి సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు అదే బాటలో తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గవర్నర్ ఆర్ఎన్ రవి తన వద్ద 12 బిల్లులను ఆమోదం తెలుపకుండా ఉంచుకున్న విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది. వాటిని ఆమోదించడానికి జాప్యం చేస్తున్నట్లు సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది.

తమిళనాడు లెజిస్లేచర్ ఆమోదించి, పంపిన బిల్లులను గవర్నర్ రాజ్యాంగపరమైన ఆమోదం తెలుపకుండా విస్మరణ, జాప్యం చేస్తున్నారని.. దీని వల్ల పరిపాలనకు ఇబ్బంది ఏర్పడుతున్నదని చెప్పింది. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింది రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పింది. శాసన సభ, ప్రభుత్వం పంపించిన ఫైల్స్‌ను పరిశీలించక పోవడం రాజ్యాంగ విరుద్దమని.. చట్ట విరుద్ధంగా, ఏపక్షంగా, అధికారాన్ని దుర్వినియోగం చేయడం కిందకు వస్తుందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొన్నది.

12 బిల్లులను నిర్ధేశిత సమయంలోగా ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం కోరింది. గవర్నర్ త్వరగా బిల్లులను ఆమోదించాలని, ఆయన తీరు రాజ్యాంగబద్ధంగా లేదని పిటిషన్‌లో ఆక్షేపించింది. గత వారమే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆర్ఎన్ రవి గవర్నర్ పదవికి తగిన వారు కాదని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News