దేశాన్ని మార్చాలన్న సంకల్పానికి మొదటి అడుగు మహారాష్ట్ర నుంచే పడనుంది : సీఎం కేసీఆర్

మన దేశానికి ఒక లక్ష్యం అంటూ లేకండా పోయింది. ఎలాంటి లక్ష్యంలేని దేశం ఎటు పోతోందో అని భయమేస్తోందని కేసీఆర్ అన్నారు.

Advertisement
Update:2023-06-15 18:30 IST

భారత దేశం మారాల్సిన సమయం వచ్చింది. మన ఆలోచన తీరు మారకపోతే ఎన్ని ఎన్నికలు వచ్చినా దేశంలో ఎలాంటి మార్పు రాదు. దేశాన్ని మార్చాలన్న మహోన్నత సంకల్పానికి మొదటి అడుగు మహారాష్ట్ర నుంచే పడనున్నదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

మన దేశానికి ఒక లక్ష్యం అంటూ లేకండా పోయింది. ఎలాంటి లక్ష్యం లేని దేశం ఎటు పోతోందో అని భయమేస్తోంది. జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశాం. జనాభా నియంత్రణకు స్పష్టమైన లక్ష్యమనేది లేకుండా పోయింది. ఇప్పుడు రాజకీయా పార్టీలకు దేశంలో జరిగే ఎన్నికలను ఎలాగైనా గెలవాలనే లక్ష్యం మాత్రమే ఉన్నదని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకొని పోయింది. ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ నాయకులు కాదు.. ప్రజలు గెలవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో జనం గెలిస్తేనే సమాజం మారుతుందని సూచించారు. జనాలు చుక్కలు కావాలి.. చంద్రడు కావాలని కోరుకోవడం లేదని.. తాగడానికి, సాగుకు కొన్ని నీళ్లను మాత్రమే అడుగుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.

వనరుల విషయంలో కానీ, నదుల విషయంలో కానీ మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ 1 స్టేట్. కానీ అలాంటి మహారాష్ట్రలోని ప్రముఖ పట్టణమైన ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుందని తెలుసుకొని చాలా బాధపడ్డానని కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా.. ఇంకా ప్రజల స్థితిగతులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోనే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా తాగునీటికి కటకటగా ఉన్నది. గంగా, యుమునా డెల్టా ప్రాంతంలో ఉన్న ఢిల్లీలో తాగు నీరు ఇప్పటికీ సమస్యగా ఉండటం బాధాకరమని అన్నారు. అక్కడ కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో అనేక పార్టీల నుంచి సీఎంలు అయిన వారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా రాష్ట్ర పరిస్థితులను మార్చలేకపోయారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాల రావాలి.. ప్రజలు గెలిస్తేనే రాష్ట్ర పరిస్థితులు మారుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడి కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఏ పార్టీ గెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం అని కేసీఆర్ అన్నారు.

ప్రపంచంలోనే ఎక్కవ సాగుకు యోగ్యమైన భూమి ఇండియాలో ఉన్నది. అయితే మన దేశంలో ఎన్నో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నది. మనం తలుచుకుంటే ప్రతీ ఎకరాకు సాగు నీరు ఇవ్వొచ్చు. దేవుడు మనకు ఎన్నో వనరులను సమృద్ధిగా ఇచ్చినా.. ఇంకా ఎందుకీ కష్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. మన దేశ జలవిధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు.

విద్యుత్ రంగంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నా.. విద్యుత్ సమస్య ఎదురవుతోంది. దేశంలోని బొగ్గుతో 150 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చని స్వయంగా కోల్ ఇండియా చెప్పింది. అయినా సరే వ్యవసాయానికి సరిపడా విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణలో పుష్కలంగా విద్యుత్ ఉన్నది. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందుతోందని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కూడా గణనీయంగా తగ్గాయని అన్నారు.

మన దేశంలో దళితుల పరిస్థితి తలచుకుంటే బాధగా ఉంటుంది. ఎస్సీల జీవితాల్లో మార్పు రానంత కాలం.. దేశం కూడా అభివృద్ధి చెందదని కేసీఆర్ చెప్పారు. అమెరికాలో నేటీవ్ అమెరికన్స్ ఎంతో కాలం వివక్షకు గురయ్యారు. వారు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారు. అయితే బరాక్ ఒబామాను అధ్యక్షుడిని చేసుకొని అక్కడి ప్రజలు తమ పాపాన్ని కడిగేసుకున్నారు. మన దేశంలో కూడా దళితులు, ఆదివాసీల ఉద్దరణ జరగాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.


Tags:    
Advertisement

Similar News