భారత్ లో ఆందోళన కలిగిస్తున్న‌ టీనేజ్ గర్భాలు

మైనార్టీ తీరక ముందే బాలికలకు పెళ్ళిళ్ళు, వెంటనే గర్భధారణ... దేశంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై చర్యలు చేపట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నడుం భిగించింది.

Advertisement
Update:2022-07-29 11:18 IST

భారతదేశంలో బాలికల గర్భదారణ ఆ‍ందోళనకలిగించే విధంగా ఉంది. చిన్నవయసులోనే పెళ్ళి జరగడం, గర్భం ధరించడంతో వారి ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటోంది. చిన్న వయసులోనే గర్భం ధరించడం ఎక్కువగా దేశంలో 118 జిల్లాల్లో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీహార్ లో19 జిల్లాలు, పశ్చిమ బెంగాల్ లో15 జిల్లాలు, అస్సాం లో13 జిల్లాలు, మహారాష్ట్ర లో13 జిల్లాలు, జార్ఖండ్ లో10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాల్లో, త్రిపురలో4జిల్లాల్లో ప్రధానంగా బాలికలు గర్భం ధరిస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.

భారతదేశంలోని 44% కంటే ఎక్కువ జిల్లాల్లో అధికశాతం ఆడపిల్లలకు 18 ఏళ్లు రాకముందే వివాహాలు జరుగుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ జిల్లాలు బీహార్ లో17 ఉండగా, పశ్చిమ బెంగాల్ లో8, జార్ఖండ్ లో7, అస్సాం లో4 జిల్లాలు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో ఒక్కొక్క జిల్లా ఉన్నాయి. ఆధునిక గర్భ నిరోధక పద్దతులను పాటించడంలో కూడా ఈ జిల్లాలకు అతి తక్కువ రేటింగ్ ఉంది.

కుటుంబ నియంత్రణపై సరైన అవగాహన లేకపోవడం, అందులో పురుషుల భాగస్వామ్యం లేకపోవడం వల్ల చిన్న వయసులో గర్భధారణ ఒక సమస్యగా మారిందని నివేదిక తెలిపింది.

దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు స్థిరీకరించబడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బాలికలు పిల్లలను కనడం అధికమవడం ఆందోళన కలిగిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన కుటుంబ నియంత్రణ విజన్-2030 డాక్యుమెంట్‌లో పేర్కొంది.

కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో పురుషుల భాగస్వామ్యం లేకపోవడం, గర్భనిరోధక సాధనాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఈ టీనేజ్ గర్భధారణకు ప్రధాన కారణమని రిపోర్టు తెలిపింది.

2036 నాటికి జనాభాలో మన దేశం చైనాను మించి పోయి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలువనున్నామన్న రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో 15-24 సంవత్సరాల వయస్సు గల యువత జనాభా మాత్రం తగ్గిపోనుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం...

"15-24 సంవత్సరాల వయస్సు గల యువత జనాభా 2011లో 23.3 కోట్ల నుండి 2021 నాటికి 25.2 కోట్ల కుపెరిగింది. ఇక‌ 2031 నాటికి 23.4 కోట్ల కు , 2036లో 22.9 కోట్ల కు తగ్గనుంది'' అని రిపోర్ట్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో మైనార్టీ తీరక ముందే పెళ్ళిళ్ళు, గర్భం ధరించడం భారత్ దేశానికి పెద్ద సస్యగా ఉండ‌బోతోందని నివేదిక తెలిపింది. అందువల్ల మైనార్టీ తీరకముందే పెళ్ళిళ్ళు చేయకుండా అవగాహన కల్పించడం, ఆధునిక గర్భనియంత్రణ కార్యక్రమంలో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం తీవ్ర కృషిచేస్తున్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. 

Tags:    
Advertisement

Similar News