చంద్రయాన్‌-3 ప్రయోగంలో టెక్నీషియన్‌.. రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్నాడు..!

దీపక్‌ కుమార్‌ది మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా. 2012లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి.. 8 వేల జీతానికి HECలో జాయిన్ అయ్యాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు.

Advertisement
Update: 2023-09-19 12:10 GMT

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి దీపక్‌ కుమార్‌ ఉప్రారియా. హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌-HECలో టెక్నిషియన్‌. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించిన చంద్రయాన్‌-3 లాంచ్ ప్యాడ్‌ తయారు చేసిన బృందంలో ఈయన సభ్యుడు. ప్రస్తుతం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. ఎందుకో తెలుసా..కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన HEC అతనికి 18 నెలలుగా జీతం చెల్లించలేదు. దీంతో రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు.




చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఆగస్టులో చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ రికార్డులకెక్కింది. ఆ సమయంలో ప్రధాని మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌ మిషన్‌ లాంచ్‌ప్యాడ్ కార్మికులను సైతం తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సందర్భంలోనే రాంచీలోని HEC ఉద్యోగులు 18 నెల జీతం బకాయిల కోసం నిరసన తెలియజేశారు.




బీబీసీ కథనం ప్రకారం.. 18 నెలలుగా HECలోని 2,800 మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. అందులో దీపక్ కుమార్ ఒకరు. కుటుంబ పోషణ భారం కావడంతో కొద్ది రోజులుగా ఇడ్లీలు అమ్ముతున్నాడు దీపక్ కుమార్‌. ఉదయం ఇడ్లీలు అమ్మి ఆఫీసుకు వెళ్తాడు. సాయంత్రం మళ్లీ ఇడ్లీలు విక్రయిస్తాడు. మొదట్లో క్రెడిట్‌ కార్డుతో ఇంటిని నెట్టుకొచ్చానని, దాంతో 2 లక్షల రూపాయల అప్పు అయిందని చెప్పాడు. ఇప్పుడు బ్యాంకు తనను ఎగవేతదారుగా గుర్తించిందన్నాడు. దీంతో బంధువుల నుంచి డబ్బు తీసుకుని ఇల్లు గడిచేందుకు ఇడ్లీలు అమ్ముతున్నట్లు చెప్పాడు. మొత్తం ఇప్పటివరకూ 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాన‌న్న దీపక్ కుమార్.. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పు పుట్టడం కష్టంగా మారిందన్నారు. దీంతో భార్య నగలను తాకట్టు పెట్టినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఇడ్లీలు అమ్మడం ద్వారా రోజుకు రూ. 300-400 వస్తున్నాయని.. 50 నుంచి వంద రూపాయల లాభం ఉంటోందన్నాడు. ఇవి ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయన్నాడు.




దీపక్‌ కుమార్‌ది మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా. 2012లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి.. 8 వేల జీతానికి HECలో జాయిన్ అయ్యాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు. కానీ, పరిస్థితులు మాత్రం అతనికి అనుకూలించలేదు. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు దీపక్‌ కుమార్‌.

*

Tags:    
Advertisement

Similar News