రాజకీయాలకు దూరమవడంపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్
కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా తనకు చాలామంది ఇదే సలహా ఇచ్చారని రజినీకాంత్ చెప్పారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే రాజకీయాలకు దూరమయ్యానని ఆయన వివరించారు.
తాను రాజకీయాలకు దూరమవడంపై ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించారు.
తనకు కిడ్నీల సమస్య ఉండటం వల్లే తాను రాజకీయాలకు దూరమయ్యానని ఈ సందర్భంగా రజినీకాంత్ తెలిపారు. కిడ్నీల సమస్యతో చికిత్స పొందుతున్నప్పుడే తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నానని ఆయన చెప్పారు. కానీ, కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనరాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సలహా ఇచ్చారని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా తనకు చాలామంది ఇదే సలహా ఇచ్చారని రజినీకాంత్ చెప్పారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే రాజకీయాలకు దూరమయ్యానని ఆయన వివరించారు. అప్పట్లో తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదని చెబితే.. తాను భయపడుతున్నానని అందరూ అనుకుంటారని భావించి.. ఈ విషయం ఎక్కడా చెప్పలేదని ఆయన తెలిపారు.
దేవుడున్నాడనేందుకు అదే నిదర్శనం..
శరీరంలో అత్యంత కీలకమైన రక్తాన్ని మానవులెవరూ తయారు చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమని రజినీకాంత్ చెప్పారు. శరీరంలోని వ్యవస్థ తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన వివరించారు. దేవుడున్నాడు అనేందుకు అదే నిదర్శనమని ఆయన చెప్పారు. దేవుడు లేడు అనేవారు కనీసం ఒక్క రక్తపు బొట్టునైనా తయారుచేసి చూపించాలని ఆయన సవాలు చేశారు.
అప్పట్లో రజినీ నన్ను అపార్థం చేసుకున్నారు.. - వెంకయ్యనాయుడు
రాజకీయాల్లోకి రావద్దని రజినీకాంత్‌కి తాను హితవు పలికానని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. అప్పట్లో ఆయన తనను అపార్థం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.