తమిళనాడులోనూ అమ్మఒడి.. బాలికలకు మాత్రమే..
నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి 12వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగా ప్రారంభించారు తమిళనాడు సీఎం స్టాలిన్.
విద్యార్థినీ విద్యార్థులకు అన్ని ప్రాంతాల్లో స్కాలర్ షిప్ లు వస్తుంటాయి. వీటికితోడు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ఏపీలో అమ్మఒడి అనే పథకం అమలులో ఉంది. దాదాపుగా ఇలాంటి పథకాన్నే ఇప్పుడు తమిళనాడులో తెరపైకి తెచ్చారు. అయితే ఇది బాలికలకు మాత్రమే. తమిళనాడులోని ప్రభుత్వ స్కూళ్లలో 6నుంచి 12వ తరగతి లోపు చదువుకునే బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి 12వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగా ప్రారంభించారు తమిళనాడు సీఎం స్టాలిన్.
పుదుమై పెన్..
పుదుమై పెన్ అనే పేరుతో ఈ పథకం తమిళనాడులో ప్రారంభమైంది. చెన్నైలోని భారతి ఉమన్స్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు స్టాలిన్, కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న మోడల్ స్కూల్స్ తరహా పాఠశాలల్ని తమిళనాడులో కూడా ప్రారంభించారు. పుదుమై పెన్ అనే ఈ పథకం తమిళనాడు చరిత్రలోనే ఓ సంచలనంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. బాలికల భవితకు ఇది ఆసరాగా ఉంటుందని అన్నారు.
ఇటీవల ఢిల్లీలోని విద్యా విధానాన్ని ఇతర రాష్ట్రాల నేతలు పరిశీలిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఢిల్లీ మోడల్ ని మెచ్చుకున్నారు, తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేస్తామన్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగానే మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ని మొదలు పెట్టారు. బీజేపీయేతర పార్టీల నేతలంతా ఇలా సమైక్యంగా ఉంటూ, సామరస్యంగా చేతులు కలపడం కమలదళానికి కంటగింపుగా ఉంది.