మూడు ట్రక్కులు - రెండు కార్ల ఢీ.. నలుగురి దుర్మరణం
ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడ్డ 8 మందికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురి జిల్లా తొప్పూర్ ఘాట్ రోడ్డులో ఒక వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది.
వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి ముందున్న ట్రక్కును ఢీకొనగా.. ఆ ట్రక్కు దాని ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ మూడు ట్రక్కుల మధ్యలో ఓ కారు కూడా చిక్కుకుంది. ట్రక్కులతో పాటుగా కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు వెనకాలే వచ్చిన మరో కారు మూడు ట్రక్కులను ఢీకొని ధ్వంసమైంది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఎనిమిది మందిని పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. వంతెనపై మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొన్న సంఘటనకు సంబంధించిన వీడియో దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఆ వీడియోలో ప్రమాదం జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ సంఘటన బీభత్సాన్ని సృష్టించింది.
ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడ్డ 8 మందికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంపై స్పందించిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ తొప్పూర్ ఘాట్ లో పెండింగ్ లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.