బీజేపీ సీఎంకు బహిరంగసభలోనే షాకిచ్చిన స్వామీజీ!
ఒక మతపరమైన కార్యక్రమంలో,ఈశ్వర నందపురి స్వామీజీతో సహా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, అనేక మంది బీజేపీనాయకులు వేదికపై ఉన్నారు. ఆసమయంలో ఈశ్వరానందపురి స్వామి, బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ స్వామీజీ షాక్ ఇచ్చారు. బెంగళూరులోని మహదేవపురలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో,ఈశ్వర నందపురి స్వామీజీతో సహా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, అనేక మంది బీజేపీ నాయకులు వేదికపై ఉన్నారు. ఆసమయంలో ఈశ్వరానందపురి స్వామి, బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు.
నియోజకవర్గంలో వరదలొచ్చినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అంటూ రాజకీయ నాయకులను నిందించారు.
"వరదలు వచ్చినప్పుడు బెంగళూరు ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోలేదో, ఆ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో నాకు తెలియదు. పెద్ద వర్షం పడితే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అధికారులకు తెలియదా ? ప్రతి ముఖ్యమంత్రి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పినవారే. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు.'' అని స్వామీజీ ఆరోపించారు.
స్వామీజీ మాటలతో అసహనానికి గురైన సీఎం బొమ్మై స్వామీజీ మాట్లాడుతుండగానే ఆయన చేతుల్లో నుంచి మైక్ లాక్కొన్నారు. “నేను ఒక విషయం స్పష్టం చేస్తాను. ఇక్కడున్న సమస్యలన్నింటినీ నా అధికారులు పరిష్కరిస్తున్నారు.. ప్రజలకు ఏ సమస్యా లేకుండా తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేను ఇతర సీఎంలు, నాయకుల మాదిరి కాదు. నేను ఏదైనా చేస్తానని చెప్పినప్పుడు, ఎంత వరకైనా వెళ్ళి చేసి తీరతాను.'' అని బొమ్మై అన్నారు.
ఆపైన స్వామీజీ సీఎం దగ్గరి నుంచి మైకు తీసుకొని మళ్ళీ రాజకీయ నాయకులను విమర్శించడం మొదలు పెట్టడంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వేదికపై అసహనంతో రగిలిపోయారు.
కాగా, బీజేపీ దక్షిణ భారతంలో అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రమైన కర్నాటకలో ఎలాగైనా తిరిగి అధికారం నిలుపుకోవాలని అనేక తిప్పలు పడుతోంది. బెంగుళూరులో వర్షాలు, వరదల వల్ల ఈ మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు రోడ్లు గుంతలతో అస్థవ్యస్థంగా తయారయ్యాయి. రోడ్లు బాగాలేకపోవడం వల్ల ప్రతి రోజూ అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రెండు వారాల క్రితం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డుపై మెట్రో పిల్లర్ కూలిపోయి తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ అంశాల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో, వరుసగా మూడు రోజులు పాటు వర్షాలు కురిసి నగరం మొత్తం వరదలతో మునిగిపోయింది. గ్లోబల్ ఐటి కంపెనీలు, స్వదేశీ స్టార్ట్-అప్‌లు ఉన్న అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.నీళ్ళు పూర్తిగా తొలగిపోవడానికి అనేక రోజులు పట్టింది. వరదల వల్ల అనేక ప్రాంతాలలో, రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నీరు, విద్యుత్ లైన్లు తెగిపోయాయి. కొన్ని హౌసింగ్ కాలనీలలోని ప్రజలను రక్షించడానికి ట్రాక్టర్లను వాడాల్సి వచ్చింది. ఇవే విషయాలను ఈశ్వర నందపురి స్వామీజీ ఈ రోజు బహిరంగ వేదికపై లేవనెత్తారు.