హిజాబ్ కేసులో కర్నాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

ఒకవేళ కర్నాటక విషయంలో హిజాబ్‌కి అనుమతిస్తే, దేశవ్యాప్తంగా కూడా ఇదే తీర్పుని అనుసరించి విద్యార్థినుల వస్త్రధారణ మారే అవకాశముంది. అందుకే ఈ కేసు విషయంలో సుప్రీం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2022-08-29 16:37 IST

హిజాబ్ కేసులో కర్నాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాడానికి నిరాకరిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

ఇటీవల కర్నాటకలో హిజాబ్ వ్యవహారం సంచలనంగా మారింది. హిజాబ్ అనేది మతపరమైన వస్త్రధారణ అని, అలాంటి దుస్తులతో కాలేజీలకు వ‌స్తే అనుమతించబోమంటూ కొన్ని విద్యాసంస్థలు తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. దీంతో హిజాబ్ కోసం కొంత మంది కోర్టు మెట్లెక్కారు. పలుమార్లు కేసు వాయిదా పడింది. చివరకు హిజాబ్ సహా ఇతర మతపరమైన వస్త్రధారణతో విద్యాసంస్థలకు హాజరుకావడం సరికాదని కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. కర్నాటక హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. కానీ సుప్రీం స్టే విధించలేదు. పిటిషన్‌ను విచారణకు మాత్రం స్వీకరించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కర్నాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

విచారణపై ఉత్కంఠ..

హిజాబ్ కోసం ఇటీవల కొంతమంది విద్యార్థినులు కాలేజీలకు వెళ్లడం మానేశారనే వార్తలు కూడా వినిపించాయి. హిజాబ్ వద్దన్నందుకు వారంతా చదువునే వద్దనుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు కీలకం కాబోతోంది. ఒకవేళ కర్నాటక విషయంలో హిజాబ్‌కి అనుమతిస్తే, దేశవ్యాప్తంగా కూడా ఇదే తీర్పుని అనుసరించి విద్యార్థినుల వస్త్రధారణ మారే అవకాశముంది. అందుకే ఈ కేసు విషయంలో సుప్రీం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News