నోట్ల రద్దు చేసిన ఆరేళ్లకు.. డీమానిటైజేషన్‌పై సుప్రీంలో విచారణ

నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్ 26ను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో అఫిడవిట్ ఫైల్ చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement
Update:2022-10-13 08:24 IST

నోట్ల రద్దు చేసి ఆరేళ్లు గడిచిన తర్వాత డీమానిటైజేషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 2006 నవంబర్ 8న దేశంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు, చిన్న, కుటీర పరిశ్రమలు నోట్ల రద్దు కారణంగా మూతబడ్డాయి. కేంద్రం నిర్ణయాన్ని అనేక మంది తప్పుబట్టారు. కానీ మోడీ ప్రభుత్వం నల్ల ధనంపై యుద్దం అని సమర్థించుకున్నది. ఆ తర్వాత కూడా నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఉపయోగం కలిగిందనే విషయాన్ని మాత్రం ఏనాడూ వెల్లడించలేదు. అయితే, నోట్ల రద్దుపై అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విచారణకు తీసుకుంటామని బుధవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. నోట్ల రద్దుపై విచారణ చేయడం పూర్తిగా సమయాన్ని వృథా చేయడమే అని, ఇప్పటికే నోట్ల రద్దు జరిగి ఆరేళ్లు గడిచిందని కేంద్రం వాదిస్తోంది.

జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ఐదుగురి సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. ఇప్పటికే నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్ 26ను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో అఫిడవిట్ ఫైల్ చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌ను ఆదేశించింది. అలాగే నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాలు, కలిగిన లాభాలపై కూడా డీటైల్ రిపోర్టు ఇవ్వాలని కోరింది. దీనిపై వచ్చే నెల 9న విచారణ చేస్తామని చెప్పింది. కాగా, అప్పటికి నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఆరేళ్లు పూర్తి కానుండటం గమనార్హం.

నోట్ల రద్దుకు సంబంధించి కేసులు వేసిన కొందరి పిటిషనర్ల తరపున మాజీ కేంద్ర మంత్రి, న్యాయవాది పి. చిదంబరం హాజరయ్యారు. నోట్ల రద్దు పూర్తిగా మతిలేని చర్యగా ఆయన అభివర్ణించారు. అనేక మంది పౌరులు నోట్ల రద్దు కారణంగా కష్టాలు పడ్డారని, గంటల కొద్దీ ఏటీఎంల ముందు నిలబడి కొత్త కరెన్సీ కోసం అవస్థలు పడ్డారని వివరించారు. కొంత మంది సరైన సమయానికి ఔషధాలు కొనుక్కోలేక పోయారని, చాలా మందికి చిన్న సంస్థలు వేతనాలు ఇవ్వలేక పోయాయని తెలిపారు. నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ, ఫేక్ కరెన్సీ మనుగడలో లేకుండా పోతుందని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదని ఆయన చెప్పుకొచ్చారు.

నోట్ల రద్దు ప్రహాసనం మొత్తం చట్ట విరుద్దంగా జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు. సాధారణంగా ఆర్బీఐ బోర్డు రికమెండ్ చేస్తే నోట్ల రద్దు జరుగుతుందని, కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్‌లో జరిగిందని ఆయన చెప్పారు. 2016 నవంబర్ 7న ప్రభుత్వం ఓ నోట్‌ను ఆర్బీఐ బోర్డుకు పంపింది. నోట్లు రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. దీంతో హడావిడిగా సమావేశమైన బోర్డు నవంబర్ 8న ఢిల్లీలో సమావేశమై.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడానికి సిఫార్సు చేస్తూ.. అప్పటికే జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి నోట్ పంపింది. ఆ రికమెండేషన్‌ను కేబినెట్ ఆమోదించడంతో డీమానిటైజేషన్ ఉత్తర్వులు జారీ అయ్యాయని చిదంబరం సుప్రీంకోర్టుకు తెలిపారు.

డీమానిటైజేషన్ విషయంలో ఇంత మెరుపు వేగంతో ఎందుకు వ్యవహరించారు? నోట్ల రద్దు వల్ల కలిగే లాభనష్టాలపై అసలు చర్చించారా అని చిదంబరం వ్యాఖ్యానించారు. నవంబర్ 7న రాసిన లేఖ, ఆర్బీఐ బోర్డు అజెండాను ఇంత వరకు పార్లమెంటు ముందు పెట్టలేదు. ఏ పబ్లిక్ డొమైన్‌లో కూడా అందుబాటులో లేవు. దీన్ని బట్టే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని ధర్మాసనానికి ఆయన వెల్లడించారు. కాగా, అవసరమైతే ప్రభుత్వం సదరు డాక్యుమెంట్లను తప్పకుండా కోర్టుకు సమర్పిస్తుందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమని తెలిపారు. అయితే, ఇలాంటి డాక్యుమెంట్లను కోర్టు స్క్రూటినీ నుంచి దూరంగా పెట్టలేరు. ప్రస్తుతానికి వాటిని మీ దగ్గరే ఉంచుకోండి. అవసరం అయినప్పుడు కోర్టు వాటిని పరిశీలిస్తుందని చెప్పింది.

Tags:    
Advertisement

Similar News