కరెంటు బిల్లు కొత్త యజమాని నుంచి వసూలు చేయొచ్చు.. - సుప్రీంకోర్టు తీర్పు
తమ నివాస ప్రాంగణాలకు విద్యుత్ నిలిపివేశారని, పాత వారు బిల్లులు చెల్లించలేదనే కారణంతో తమకు విద్యుత్ నిలిపివేయడం ఎంతవరకు సబబని పేర్కొంటూ 19 మంది ఈ వ్యవహారంపై పిటీషన్లు దాఖలు చేశారు.
ఏదైనా నివాస ప్రాంతం లేదా ప్రాంగణానికి సంబంధించిన విద్యుత్ బిల్లును పాత యజమాని చెల్లించకపోతే.. ఆ బకాయిని కొత్త యజమాని చెల్లించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఈ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
తమ నివాస ప్రాంగణాలకు విద్యుత్ నిలిపివేశారని, పాత వారు బిల్లులు చెల్లించలేదనే కారణంతో తమకు విద్యుత్ నిలిపివేయడం ఎంతవరకు సబబని పేర్కొంటూ 19 మంది ఈ వ్యవహారంపై పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పాత యజమాని బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరని స్పష్టం చేసింది. పాత యజమాని బిల్లులను కొత్త యజమాని నుంచి వసూలు చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ సప్లయి కోడ్ వీలు కల్పిస్తోందని తెలిపింది. 1948 నాటి చట్టంలోని సెక్షన్ 49 దీనిని పేర్కొంటోందని వివరించింది.
2003 విద్యుత్ చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం.. విద్యుత్ సరఫరా చేయడం తప్పనిసరి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అది విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్దేశించిన చార్జీలు, నియమనిబంధనలకు లోబడి చేసుకునే దరఖాస్తుకు అనుగుణంగా ఉంటుందని తెలిపింది.