ఆ బాణసంచాపై నిషేధం.. అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది..

కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

Advertisement
Update:2023-11-08 08:30 IST

నిషేధిత రసాయనాలు కలిపిన బాణసంచా నిషేధం ఢిల్లీకే కాకుండా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాజస్థాన్‌ నుంచి నమోదైన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా మంగళవారం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బేరియం కలిసి ఉన్న సంప్రదాయ రకాల బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ 2018లో ఇచ్చిన ఉత్తర్వు.. ఢిల్లీ ఎన్సీఆర్‌ ప్రాంతానికి మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీపావళి బాణసంచా విషయంలో ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని రాజస్థాన్‌ సర్కారును ఆదేశించింది.

కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 మధ్య బాణసంచా కాల్చేందుకు ఇచ్చిన అనుమతిని గంటసేపు పొడిగించాలని రాజస్థాన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది మనీశ్‌ సింఘ్వి సుప్రీంకోర్టును కోరగా.. ఒక రాష్ట్రానికి సడలింపు ఇస్తే అనేక రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వస్తాయని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఆ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. గడువును గంట అటూఇటూ చేసినా కాలుష్యం తగ్గదని, కొనుగోలు చేసిన బాణసంచాను ప్రజలు కాలుస్తారని జస్టిస్‌ బోపన్న అన్నారు.

కాలుష్యాలకు అడ్డుకట్ట వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం

బాణసంచా దుష్ప్రభావాల గురించి సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కీలకమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో పిల్లల కంటే పెద్దవారే బాణసంచా ఎక్కువగా కాలుస్తుండడం విచారకరమని పేర్కొంది. కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ అనేవి న్యాయస్థానాలు చూసుకోవాల్సిన విధి అనేది తప్పుడు భావన అని తెలిపింది. వాయు, ధ్వని కాలుష్యాలకు అడ్డుకట్ట వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News